టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు టీవీ షోల్లోనూ జడ్జిగా చేశారు. మోడ్రన్ మహాలక్ష్మి, జబర్దస్త్ వంటి షోలతో అభిమానులను ఎంటర్‌టైన్ చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా ప్రజా సేవలో ఉంటూనే ఇటు కామెడీ షో ‘జబర్దస్త్’లో జడ్జిగా వ్యవహరించారు. ఇదే సమయంలో పలు సినిమాల్లోనూ నటించి మెప్పించారు.
పాలిటిక్స్‌లో రోజా అంటేనే ఓ ఫైర్ బ్రాండ్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆమెకు మంత్రిగా పని చేసే అవకాశం వచ్చింది. దీంతో ఇక బుల్లితెరకు దూరంగా ఉంటూ.. పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేశారు. 2024లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆమె పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడూ కొంత సోషల్ మీడియాలో టీడీపీని విమర్శిస్తున్నా అంతకు ముందున్నంత యాక్టివ్‌గా లేరనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. తాజాగా.. ఆమె మళ్లీ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగులో ప్రసారం కానున్న ‘సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్’ సీజన్ 4లోకి జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రోజా తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. రోజాతో పాటు సీనియర్ హీరో శ్రీకాంత్, సీనియర్ హీరోయిన్ రాశి ఈ షోలో జడ్డీలుగా వ్యవహరిస్తున్నారు.
రోజాను ఈటీవీ వద్దందా?
రోజా బుల్లితెర ప్రయాణం ఈటీవీతోనే మొదలైంది. జబర్దస్త్ కామెడీ షోకు మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి రోజా జడ్జిగా వ్యవహరించారు. వారిద్దరి పెయిర్ అప్పుడు బాగా పాపులర్ అయింది. దీంతో ఆ కామెడీ షోకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. రోజా వైసీపీలో చేరినా కూడా రాజకీయం వేరు.. ఎంటర్‌టైన్‌మెంట్ వేరు అనుకుని ఆమెను ఈటీవీ సంస్థ అప్పుడు కూడా కొనసాగించారు. అయితే రామోజీరావు మరణానంతరం వైసీపీకి-ఈనాడు సంస్థలకు ఉన్న వైరుధ్యం దృష్ట్యా ఆమెను తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో రోజా జీ తెలుగుకు వెళ్లిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల వరకు రోజా బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఆమె సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.