ప్రభుత్వ సమీక్షలు ఆ అధికారికి ఆటవిడుపు అయిపోయింది. సమీక్ష చేసేందు ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ వచ్చారన్న సోయి మరిచి…. పైసలు సంపాదించేందుకు రమ్మీ ఆటలో మునిగిపోయాడో అధికారి. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతపురం సత్యసాయి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అసిస్టెంట్ కలెక్టర్లు సహా పలువురు జిల్లా అధికారులంతా ఆ సమీక్షలో పాల్గొన్నారు. ఓ వైపు ఎస్సీ వర్గీకరణపై వినతిపత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాలు తరలివచ్చాయి.
అధికారులంతా అందులో బిజీబిజీగా గడుపుతుంటే… తనకేమి పట్టనట్టు స్మార్ట్ ఫోన్‌లో రమ్మీఆటలో మునిగిపోయాడు డీఆర్వో మలోల. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమిషన్ ఛైర్మన్, కలెక్టర్లు, ఎస్పీలు ఉన్న సమీక్షలోనే సదరు అధికారి ఇలా వ్యవహరిస్తే… మరి సాధారణ జనాలు తమ సమస్యలతో వెళితే ఏ విధంగా స్పందిస్తాడో అర్థం అయిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.