ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 20 శాతం మార్జిన్ ఇస్తామంటేనే మద్యం దుకాణాలకు టెండర్లు వేసామని, ఇప్పుడు ప్రభుత్వం 10 శాతం మాత్రమే మార్జిన్ ఇవ్వడంతో మద్యం దుకాణాల నిర్వహణ కష్టతరంగా మారిందని తూర్పు గోదావరి జిల్లా వైన్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేసారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14.5 శాతం మార్జిన్ ఇస్తామని ప్రకటించారని అలా ఇస్తే తమ వ్యాపారం మరింత నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవరపల్లి కృష్ణ, నగర అధ్యక్షుడు కొత్తపల్లి బాలు మాట్లాడారు. గత మూడు నెలల కాలంగా 15 నుంచి 20 లక్షల మేరకు నష్టం వచ్చిందని, ఆ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము దుకాణాలు బంద్ చేయడానికి కూడా సిద్ధమని అన్యనారు. మద్యం వ్యాపారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతోనూ స్నేహంగా ఉంటామని దయచేసి తమని రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేసారు.
తాము ఎవరికి డబ్బులు ఇవ్వడం లేదని, ఇచ్చే పరిస్థితుల్లో కూడా తాము లేమని వెల్లడించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కమీషన్లు ఇస్తున్నామంటూ మాజీ ఎంపీ ఆరోపించడం అర్థరహితమని కొట్టిపారేశారు.అసలే నష్టాల్లో ఉంటే కమీషన్లు ఎలా ఇస్తామని వారు ప్రశ్నించారు. మీ రాజకీయ లబ్ది కోసం తమను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని కోరారు.
నిజానికి రూపాయి లంచం లేకుండా ఎమ్మెల్యే తమకు సహరిస్తున్నారని చెప్పారు. గత 25 – 30 ఏళ్లుగా లిక్కర్ వ్యాపారంలో ఉన్నామని, ఎవరు అధికారంలో ఉంటే వారి దగ్గరకు వెళ్లి తమ గోడు చెప్పుకోవడం సహజమని వారు పేర్కొన్నారు.
ఈ వ్యాపారంలోకి రాజకీయ పార్టీ నేతల అనుచరులు రాకూడదని ఈ వ్యాపారంలోకి రాకూడదని ఎక్కడా లేదని అన్నారు. ఒకవేళ వచ్చినా సరే, వ్యాపార రీత్యా అందరూ ఒకటిగానే ఉంటామని చెప్పారు. నష్టాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. 14.5 శాతం మార్జిన్ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అయితే ఇంకా జీవో రాలేదని వారు పేర్కొన్నారు. జీవో వస్తే లాభాలు లేకున్నా నష్టపోకుండా ఉంటామని చెప్పారు. ఒకవేళ జీవో రాకపోతే తమ వ్యాపారాలు గత్యంతరం లేక మూసెయ్యాల్సిందేనని తూర్పు గోదావరి జిల్లా వైన్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన చెందారు.