స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ వైపు చూసిన నేతలంతా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకుంటున్నారు. దేశంలోని అనేక స్థానాల్లో పట్టు కోల్పోయిన కాంగ్రెస్.. మళ్ళి తమ బలాన్ని చూపించే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా కర్ణాటకలో గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూలత పెరుగుతుంది. బీజేపీ చేరిన నేతలంతా కాంగ్రెస్ వైపుకు వచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. త్వరలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సీఎం కేసీఆర్ పై నిత్యం విరుచుకుపడే వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్తో పొత్తుకు అభ్యంతరాలు లేవు అన్నట్లుగా వ్యవహారిస్తోంది. కెసిఆర్ ను ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తామని ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చింది. ఈక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో షర్మిల భేటీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో జాతీయ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా షర్మిలతో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.