సోషల్ మీడియాలో ఇష్టానుసారం చేస్తున్న పోస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధానంగా ఆడబిడ్డలను కించపరిచేలా కొందరు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరావతి రాజధాని పరిధిలోని తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి.
అభివృద్ధికి ఆటంకం కలిగించేలా సోషల్ మీడియాలో వైసీపీ నేతలు పోస్టులు పెడుతున్నారని సభా వేదికపై నుంచి ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తనతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, ఇతర ఎమ్మెల్యేలపైనా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని అన్నారు. ఇలా చేసే వారిని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. బాంబులకు కూడా భయపడలేదన్న సీఎం.. తన గురించి అసెంబ్లీలో దుర్మార్గంగా మాట్లాడినప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నట్లు వెల్లడించారు. కొవ్వు ఎక్కువై కొందరు నేరస్తులుగా తయారవుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు.
నేరస్తులు రాజకీయ ముసుగులో ఉండి ఘోరాలు చేస్తున్నారని అన్నారు చంద్రబాబు. అదేమని ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం అంటున్నారని ఆక్షేపించారు. హద్దులు దాటితే ఉపేక్షించేది లేదన్న ఆయన.. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. నేరస్తులను కట్టడి చేసేందుకు పోలీసులను సమర్థంగా తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు.
పాత ప్రభుత్వ దుర్మార్గంతో కొంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు ఏపీ సీఎం. ఆధునిక సాంకేతికతతో గ్యాస్ ఆధారిత విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించుకోవడం గర్వకారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం శంకుస్థాపన చేసిన 12 సబ్‌స్టేషన్‌లు, 10 ట్రాన్స్ మిషన్ లైన్ల పనులు ఏడాది లోపు పూర్తవుతాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.