బీజేపీ, కాంగ్రెస్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు ఆరోపణలు చేశారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకమాడుతూ బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో అంట కాగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా బీజేపీ నేతలెవరూ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. ఫిక్షన్ కంటే వాస్తవం వింతగా ఉంటుందని రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే నమ్మక తప్పడంలేదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు కీలక పరిణామాలను కేటీఆర్ ఉదహరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో రెండు వారాల కిందట ఈడీ దాడి చేసిందని, దాడుల్లో వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వచ్చాయని గుర్తుచేశారు. రెండు వారాలు పూర్తయినా ఈ సంఘటనకు సంబంధించి ఒక్క మాట కూడా బయటకి రాలేదని పేర్కొన్నారు. ఇప్పటికీ ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నుంచే కాకుండా కనీసం ఈడీ నుంచైనా అధికారిక లెక్కాపత్రం వెల్లడికాలేదని అన్నారు.
కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన 40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిన ఉదంతాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు ఏమీ జరగలేదని తెలిపారు. కనీసం దారిమళ్లిన నిధుల విషయంపైనా ఇప్పటికీ ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఈడీ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను రక్షిస్తున్న పెద్దన్న ఎవరనేది తేలాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.