పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములు ఏమైనా ఉన్నాయా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అటవీ భూములుంటే.. ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సరస్వతి పవర్‌కు ఒక వెయ్యి 515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ అంశంపై వారితో ఆయన చర్చించారు. వాటిలో ప్రభుత్వ, అటవీ భూములు, జలవనరులు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. దీంతో పాటు పర్యావరణ అనుమతులు ఎలా పొందారో తెలియజేయాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించారు. ఈ అంశాలపై అటవీ, రెవెన్యూ, పీసీబీ తదితర శాఖల ఉన్నతాధికారులతో త్వరలో సమీక్షించాలని పవన్ నిర్ణయించారు.