స్వతంత్ర వెబ్ డెస్క్: దేశంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పని చేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్లే క్షణాల్లో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఖమ్మం నగరంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు జిమ్‌కి వెళ్లొచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలోని బాలపేటకు చెందిన శ్రీధర్ ఈ ఉదయమే జిమ్‌కు వెళ్లి, ఇంటికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లోనే కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు శ్రీధర్‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే శ్రీధర్ మరణించినట్లు పేర్కొన్నారు. శ్రీధర్ గతంలో ఓ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందాడు. శ్రీధర్ మృతిపట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని అల్లిపురంలో ఆదివారం ఉదయం నాగరాజు(33) అనే యువకుడు కూడా ఇలాగే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.