బీఆర్ఎస్‌లో బావాబామ్మర్థుల ఆధిపత్య పోరు నడుస్తోందా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య గత కొన్ని రోజులుగా అప్పులు, ఆర్థిక పరిస్థితి, గురుకుల టెండర్ల అంశాలపై పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామాల్లో బీఆర్ఎస్ తరఫున మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. తనకున్న సుదీర్ఘ అనుభవంతో రిజర్వుబ్యాంకు అధికారిక లెక్కలను, కాగ్ నివేదికలను ప్రస్తావిస్తూ ఆయన వరుసగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. ప్రభుత్వం చెబుతున్న గణాంకాలన్నీ పచ్చి అబద్ధాలంటూ ఆయన ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రెస్ క్లబ్ వేదికగా సవాళ్లు విసిరి, నేరుగా రోడ్డుమీదికి వచ్చి మీడియా అటెన్షన్‌ను మొత్తం తనవైపు తిప్పుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం కేవలం తెలంగాణ భవన్‌లో జరిగే సాధారణ ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. అప్పుల వ్యవహారంలో ప్రభుత్వంపై దాడి చేయడంలో కేటీఆర్ కంటే హరీశ్‌రావు స్పష్టమైన అప్పర్ హ్యాండ్ సాధించారనే అభిప్రాయం అటు రాజకీయ విశ్లేషకుల్లోను, ఇటు సొంత పార్టీ కేడర్‌లోను బలంగా వ్యక్తమైంది. ఆర్థిక అంశాలపై హరీశ్ ప్రదర్శించిన వాగ్ధాటి, సబ్జెక్టుపై ఆయనకున్న లోతైన అవగాహన కేడర్‌లో సరికొత్త జోష్ నింపింది. ఈ ఎపిసోడ్‌తో పార్టీలో హరీశ్‌రావు గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే చర్చ తెలంగాణ భవన్‌లో జోరుగా సాగింది.

అప్పుల అంశంలో హరీశ్‌రావుకు వచ్చిన రాజకీయ మైలేజీని అధిగమించేందుకు, కేటీఆర్ వ్యూహాత్మకంగా తన రూట్ మార్చారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులంతా ‘కూలేశ్వరం’ అంటూ ఎటకారం చేస్తుండటంతో, ఆ సున్నితమైన అంశాన్ని కేటీఆర్ తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. హఠాత్తుగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు ఆయన పర్యటన చేపట్టారు. అయితే, ఈ అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు పర్యటనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు ఎక్కడా కనిపించకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపింది. సాగునీటి పారుదల అంశాల్లో, ప్రాజెక్టుల నిర్మాణంలో లోతైన అవగాహన ఉన్న హరీశ్‌రావును కేటీఆర్ కావాలనే ఈ పర్యటనకు ఆహ్వానించలేదా, లేక హరీశ్‌రావే ఈ టూర్‌పై ఆసక్తి చూపలేదా, అలా కాకుండా ఉద్దేశపూర్వకంగానే వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నారా అనే గుసగుసలు బీఆర్ఎస్ శ్రేణుల్లో మొదలయ్యాయి. కన్నెపల్లి టూర్‌లో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించడం స్పష్టంగా కనిపించింది. పంపుహౌస్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడం, ప్రభుత్వం దమ్ముంటే మోటార్లు ఆన్ చేయాలని కేటీఆర్ సవాల్ విసరడం, అవసరమైతే 50 వేల మంది రైతులతో వచ్చి తానే మోటార్లను ఆన్ చేస్తానని ప్రకటించడం వంటి హైడ్రామాతో ఆయన ఒక రోజంతా మీడియా స్పేస్‌ను పూర్తిగా ఆక్రమించేశారు.

బీఆర్ఎస్‌లో బావబామ్మర్దులైన హరీశ్‌రావు, కేటీఆర్ మధ్య కంటికి కనిపించని కోల్డ్ వార్ నడుస్తోందనేది తెలంగాణ భవన్‌లో ఓపెన్‌గా వినిపించే మాట. వీరిరువురి మధ్య మైలేజ్ కోసం జరుగుతున్న ఈ పోటీ ఈనాటిది కాదని, గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటి నుంచే ఈ పోటాపోటీ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పార్టీ సీనియర్లు గుర్తుచేస్తున్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ ప్రధాన వక్తగా చర్చలో పాల్గొన్న సమయంలోనే, హరీశ్‌రావు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, రాష్ట్ర బడ్జెట్‌పై జరిగే ప్రధాన చర్చలో హరీశ్‌రావు పార్టీ తరఫున కీలక పాత్ర పోషిస్తే.. సరిగ్గా అదే సమయంలో కేటీఆర్ చిట్-చాట్ పేరుతో మీడియా ప్రతినిధులతో సమావేశమై కొన్ని సెన్సేషనల్ ఇన్‌పుట్స్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఒకరు సభలో మాట్లాడుతుంటే, మరొకరు మీడియా ముందుకు వచ్చి వార్తల్లో సమాన ప్రాధాన్యం దక్కించుకునే ఈ ఆనవాయితీ అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. కేవలం మీడియా సమావేశాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి పర్యటనల్లోనూ ఈ ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాల సందర్భంగా కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. దానికి పోటీగా హరీశ్‌రావు సైతం కేవలం తన ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం కాకుండా.. ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్, హన్మకొండ, జనగాం వంటి వివిధ జిల్లాల్లో పర్యటించి తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని, కేడర్‌ను సమన్వయం చేసుకునే పనిలో పడ్డారు.

బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో హరీశ్‌రావుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య వివాదాలు తలెత్తినా, నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీ ఉన్న క్లిష్ట సమయాల్లోనూ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ హరీశ్‌రావుకే బాధ్యతలు అప్పగించేవారు. సమస్యను ఎలా పరిష్కరించాలో స్పష్టమైన దిశానిర్దేశం చేసి ఆయనను రంగంలోకి దించేవారు. క్షేత్రస్థాయిలో పార్టీని గట్టెక్కించడంలో ఆయన చూపిన చొరవ వల్లే పార్టీ కేడర్‌లో హరీశ్‌రావుకు ‘ట్రబుల్ షూటర్’ అనే శాశ్వత గుర్తింపు లభించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు కాళేశ్వరం ప్రాజెక్టుతో పేగుబంధం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకల ఆరోపణలు వచ్చినప్పుడు, 2024 అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేశారు. ప్రాజెక్టు వైఫల్యాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ముందుకు సైతం హరీశ్‌రావు స్వయంగా హాజరై, గంటల తరబడి సాంకేతిక వివరణలు ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన రాగానే కేసీఆర్ తర్వాత వెంటనే గుర్తుకొచ్చే పేరు హరీశ్‌రావుదే. అటువంటి అత్యంత కీలకమైన, హరీశ్‌రావుకు పూర్తి పట్టున్న ఇరిగేషన్ సబ్జెక్టును ఇప్పుడు కేటీఆర్ టేకప్ చేయడం, కన్నెపల్లి పంపుహౌస్ పర్యటనకు పూర్వపు మంత్రిని దూరం పెట్టడం పార్టీలో సరికొత్త చర్చకు, అనేక అనుమానాలకు తావిచ్చింది. తన శాఖపై వేరొకరు ఆధిపత్యం చెలాయించడాన్ని హరీశ్ వర్గం జీర్ణించుకోలేకపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కన్నెపల్లి పంపుహౌస్ పర్యటనతో కేటీఆర్ రాత్రికి రాత్రే మీడియాలో హైలైట్ కావడం, అప్పుల ఇష్యూని దాటేసి వార్తల్లో నిలవడంతో ఇప్పుడు అందరి దృష్టి హరీశ్‌రావు తదుపరి వ్యూహంపైనే పడింది. కేటీఆర్ దూకుడుకు చెక్ పెట్టేలా హరీశ్‌రావు తీసుకోబోయే తదుపరి చర్యలు ఏమిటి, ఆయన టేకప్ చేయబోయే కొత్త పొలిటికల్ ఇష్యూ ఏంటనేది బీఆర్ఎస్ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిరోజూ ఏదో ఒక అంశంతో బీఆర్ఎస్‌ను కార్నర్ చేస్తుంటే.. ఆ దాడిని సమష్టిగా తిప్పికొట్టాల్సిన అగ్రనేతలు ఇలా మైలేజ్ కోసం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం పార్టీ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. పార్టీలో నంబర్ టూ స్థానం కోసం, భవిష్యత్ నాయకత్వం కోసం బావబామ్మర్దుల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ నష్టపోతోందనే ఆవేదన సీనియర్ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. అయితే, మరో వర్గం మాత్రం ఈ పోటాపోటీ వ్యూహాలను సానుకూలంగా చూస్తోంది. ఇద్దరు అగ్రనేతలు వేర్వేరు అంశాలను భుజాన వేసుకుని ప్రభుత్వంపై దాడులు చేస్తుండటం వల్ల కాంగ్రెస్ సర్కార్‌కు ఊపిరి పీల్చుకునే సమయం దొరకడం లేదని, ఇది వ్యూహాత్మక విభజన మాత్రమేనని సమర్థించుకుంటున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న సహజ పోటీనా, లేక రాజకీయ ప్రాధాన్యం కోసం జరుగుతున్న పక్కా కోల్డ్ వారా అన్నది రాబోయే రోజుల్లో వారు చేపట్టబోయే కార్యక్రమాలను బట్టి స్పష్టమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్‌లోని ఈ రెండు పవర్ సెంటర్ల రాజకీయ ఎత్తుగడలు తెలంగాణ పాలిటిక్స్‌ను మరింత రసవత్తరంగా మార్చేశాయి.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్