చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ప్రస్తుత మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, వారి స్థానంలో అనుభవజ్ఞులైన సీనియర్ నేతలతో పక్కా ఎలక్షన్ టీమ్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం, మిత్రపక్షాల మధ్య సమన్వయ లోపమే ఈ సంచలన నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ చంద్రబాబు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే ఆ యువ మంత్రులు ఎవరు? ఏ సీనియర్ నేతలకు మళ్లీ మంత్రివర్గంలో అదృష్టం వరించబోతోంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలి మంత్రివర్గంలో ఎవరూ ఊహించని విధంగా సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టారు. భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయాలన్న ఉద్దేశ్యంతో, యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చాలా మంది కొత్త వారికి కేబినెట్ లో చోటు కల్పించారు. అయితే, ఆశించిన స్థాయిలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ యువ టీమ్ పూర్తిగా తడబడుతోందని అధినేత గ్రహించారు. కేవలం పరిపాలన మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా పార్టీని బలోపేతం చేయాల్సిన ప్రస్తుత తరుణంలో.. ప్రస్తుతమున్న మంత్రివర్గంతో భవిష్యత్తు ఎన్నికలకు వెళితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని చంద్రబాబు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. అందుకే పాలనలోనూ, రాజకీయాల్లోనూ ఆరితేరిన సీనియర్ నేతలకు తిరిగి కేబినెట్ లో అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చారు. పక్కా ఎలక్షన్ టీమ్ గా మంత్రివర్గాన్ని తీర్చిదిద్దేందుకు త్వరలోనే భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు.

ప్రస్తుత మంత్రుల పనితీరు బాగాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడానికి అనేక కారణాలున్నాయి. మంత్రివర్గ కూర్పు సమయంలో సామాజిక కోణంలోనూ, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కేలా ప్రాంతీయ సమతుల్యత పాటించే విధంగా ఎంతో ఆలోచించి కొత్త వారిని ఎంపిక చేశారు. అయితే అధినేత ఇచ్చిన ఆ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుని నిరూపించుకోవడంలో ఆ కొత్త మంత్రులు దారుణంగా విఫలమయ్యారు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నుంచి ప్రతిరోజూ వస్తున్న తీవ్రమైన విమర్శలను, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఎక్కువ మంది మంత్రులు చేతులెత్తేస్తున్నారు. రాజకీయపరమైన కౌంటర్లు ఇవ్వడంలో వారికి ఏమాత్రం అనుభవం లేకపోవడం ప్రభుత్వ ఇమేజ్ కు నష్టం చేకూరుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మంత్రులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే వారి తీరులో మార్పు రాలేదు. అదే ఎన్నికల సమయంలో వాయిస్ ఉన్న సీనియర్ నేతలు మంత్రివర్గంలో ఉంటే, ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్లు పడతాయని, రాజకీయంగా ఈ బలహీన పరిస్థితి ఉండదని చంద్రబాబు గట్టిగా అంచనా వేస్తున్నారు.

ఒక ప్రభుత్వం విజయవంతం కావాలంటే కేవలం పథకాలు అమలు చేస్తే సరిపోదు, వాటిని ప్రజల ముంగిటకు అత్యంత ప్రభావవంతంగా తీసుకువెళ్లగలగాలి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను రికార్డు స్థాయిలో అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. వృద్ధులకు భారీగా పెన్షన్లు పంపిణీ చేయడం, అన్న క్యాంటీన్ల నిర్వహణ, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి ఎన్నో మంచి పనులు చేస్తోంది. కానీ, ఈ గొప్ప విజయాలను, ప్రభుత్వ కృషిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మంత్రులు పెద్దగా ఏమాత్రం ప్రయత్నించడం లేదని అధిష్టానం గుర్తిస్తోంది. ప్రతిపక్షం చేసే దుష్ప్రచారాన్ని అడ్డుకుని, ప్రభుత్వం చేస్తున్న మంచిని గడపగడపకూ వివరించే బాధ్యత మంత్రులపైనే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజలను ఆకట్టుకునే ప్రసంగ చాతుర్యం ఉన్న సీనియర్ నాయకులు ఉంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మరింత మైలేజ్ వస్తుందన్నది ముఖ్యమంత్రి ఆలోచన. పాలనాపరమైన అనుభవం లేకపోవడం వల్లే ప్రస్తుత మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను ఓన్ చేసుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

కేబినెట్ ప్రక్షాళనకు దారితీస్తున్న మరో ప్రధాన సమస్య మిత్రపక్షాల మధ్య సఖ్యత లేకపోవడం. రాష్ట్రస్థాయిలో అగ్ర నేతల మధ్య అద్భుతమైన సమన్వయం ఉన్నప్పటికీ.. అనేక జిల్లాల్లోని నియోజకవర్గాల్లో కూటమిలోని మిత్ర పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య కనీస సమన్వయం లేదు. ఇది కూటమి పునాదులకే అత్యంత ప్రమాదకరమని చంద్రబాబు ముందే గ్రహించారు. పదవులు, కాంట్రాక్టులు, ఇసుక, మద్యం షాపుల వంటి ఆర్థికపరమైన విషయాల్లో స్థానిక నేతల మధ్య తీవ్ర స్థాయిలో తేడాలు వస్తున్నాయి. ఈ విభేదాలను పరిష్కరించి, మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం కుదర్చాల్సిన బాధ్యత ఆయా జిల్లాల ఇన్ ఛార్జి మంత్రులపై ఉంటుంది. కానీ, చాలా మంది మంత్రులు ఆ బాధ్యతను గాలికొదిలేసి, ఒక వర్గానికే బాహాటంగా కొమ్ము కాస్తున్నారన్న పక్కా నివేదికలు అధిష్టానానికి చేరాయి. మిత్రధర్మాన్ని పాటించకుండా సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న మంత్రుల తీరు చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి కారణమైందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిని సీనియర్లైతే చాకచక్యంగా డీల్ చేస్తారని ఆయన నమ్ముతున్నారు.

కూటమి విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించి, పార్టీ కోసం కొన్ని దశాబ్దాలుగా అహర్నిశలు పనిచేస్తున్న సీనియర్ నేతలను విస్మరించడం పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని ముఖ్యమంత్రి బావిస్తున్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ఆ ఉద్దండులకు కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై వారిలో తీవ్ర అసంతృప్తి, అసహనం గూడుకట్టుకుని ఉంది. ఈ అసంతృప్తి ఇలాగే కొనసాగితే పార్టీ సంస్థాగత ఎదుగుదలకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చంద్రబాబు ఒక స్పష్టమైన అంచనాకు వచ్చారు. అందుకే పాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టడానికి, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడానికి త్వరలోనే పూర్తి స్థాయి కేబినెట్ ప్రక్షాళనకు ఆయన సిద్ధమవుతున్నారని పార్టీ అత్యున్నత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పనితీరు బాగాలేని వారికి ఉద్వాసన పలికి, వారి స్థానంలో విధేయులైన సీనియర్లకు పట్టాభిషేకం చేయబోతున్నారు. ఈ సంచలన మార్పులకు సంబంధించిన ముహూర్తం మాత్రం అతి త్వరలోనే ఉంటుందని రాజధాని అమరావతి వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Latest Articles

కోవిడ్‌ను మించిన వైరస్‌… లాక్‌డౌన్‌ తప్పదా?

మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్‌ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్‌ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్