గులాబీ శ్రేణుల్లో సమన్వయం కొరవడిందా…? పార్లమెంట్ ఎన్నికలపై ఆ ప్రభావం పడనుందా..? పార్టీ సీనియర్లను, ఉద్యమకారులను పక్కనపెట్టి పెత్తనపు రాజకీయాలు చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇంతకీ పెత్తనం చేస్తుంది ఎవరు..?, ఎందుకు సీనియర్లను, ఉద్యమకారులను పక్కన పెడుతున్నారు..?
అధికారం కోల్పోయాక బీర్‌ఎస్‌కు గడ్డుకాలం నడుస్తోంది. ఎటు చూసినా కోలుకోలేని దెబ్బలతో పార్టీ కుదేలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేతల వైఖరి కొంప ముంచేలా ఉందని.. అయినా సరే కొందరిలో మార్పు రావడం లేదని ఫైర్ అవుతోంది క్యాడర్. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అంతా తమదే అన్నట్టు చలాయించుకున్నారు మాజీ మంత్రులు. వారే జిల్లా ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించారు. వారి కనుసన్నల్లోనే రాజకీయాలు నడిచాయి. మాట వినలేదో అంతే… వారిపై కక్షసాధించేవారన్న విమర్శలు ఉన్నాయి. అయితే,.. అధికారం పోయి పార్టీ బలహీనపడుతున్నా వారి పెత్తనం వారిదే. వారు చెప్పిందే చేయాలి, అన్నదే జరగాలి అన్నట్టు నడుస్తోంది గులాబీ రాజకీయం.
లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగేందుకు సీనియర్ నేతలు, ఇది వరకు కార్పొరేషన్లుగా పని చేసిన నాయకులు, ఉద్యమకారులు తమకు అవకాశం కల్పించాలని కోరారు. కానీ,.. ఉమ్మడి జిల్లాల మాజీ మంత్రులు వారి మాటను పెడ చెవిన పెట్టి.. తమకు అనుకూలంగా ఉన్నవారికే టికెట్ ఇప్పించు కున్నారన్న విమర్శ వినిపిస్తోంది. దీంతో కొందరు నిరాశలో ఉన్నట్టు సమాచారం. అయితే,.. ఆశావహు లను బుజ్జగించి కలుపుకుపోవాల్సిన నేతలు… ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వారితో మాట్లాడటా నికి కూడా వెనుకాడుతూ మొఖం చాటేస్తున్నారు. దీంతో ఈ ఎఫెక్ట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశ ముందన్న టాక్ నడుస్తోంది. మరోవైపు పార్లమెంట్ పరిధిలో నిర్వహించే సమావేశాల్లో ఈ లోపా లను ఎత్తి చూపుతుంటే,.. వాటిని సరిచేసుకోవాల్సింది పోయి, వారినే దూరం పెడుతున్నారని మండిప డుతున్నారు లోకల్ లీడర్లు. తాము సమావేశాలకు హాజరైతే నిలదీస్తామని.. అదే జరిగితే క్యాడర్‌లో చులకన అవుతామన్న భావనతో దూరం పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. పార్టీ నిర్వహిస్తున్న కార్య క్రమాలకు సైతం తమను పిలవడం లేదని బహిరంగంగానే మండిపడుతున్నారు.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులకు కేసీఆర్ పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే,.. ఓడిపోయినా కూడా పెత్తనం చెలాయించే నేతల వైఖరి మాత్రం మారలేదని.. మాజీ మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై క్యాడర్ గుర్రుగా ఉంది. దీంతో తమపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా గులాబీ బాస్ పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టాలని కోరుతున్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అందరికీ భాగస్వామ్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి పని చేస్తున్నప్పటికీ తమకు పార్టీలో అవకాశం రాకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమను గుర్తించి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇకనైనా క్షేత్ర స్థాయి పరిణామాలపై కేసీఆర్ ఫోకస్ పెడతారా..? పెత్తనం చేస్తున్న వారి తోకలు కత్తిరిస్తారా..? పార్టీ బలోపేతానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


