వర్షం లేకుండానే రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ కాలుష్యం కారణంగా మంచు వేగంగా కరుగుతోంది. రష్యాలోని ఉరల్ మంచు పర్వతాలు వేగంగా కరగడంతో యూరప్‌లోని అతిపెద్ద నదులకు నీరు పోటెత్తింది. రికార్డు స్థాయిలో నీటి స్థాయి పెరగడంతో వరదలు వచ్చాయి. వరదల కారణంగా ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
యూరప్‌లో అతి పొడవైన నది అయిన ఉరల్ నది గంటల వ్యవధిలోనే ఉప్పొంగింది. నీటి ఉధృతికి మాస్కోకు తూర్పున 1, 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్క్స్ నగరంలోని ఆనకట్ట ఒక్కసారిగా తెగిపో యింది. దీంతో సమీప గ్రామాలను వరద ముంచెత్తింది. భారీ మొత్తంలో నీరు గ్రామాల్లోకి ప్రవేశించగా… సుమారు 10వేలకు పైగా ఇళ్లు వరద ముంపుకు గురయ్యాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ఆ వేడికి మంచు కరగి ఈ విపత్తు సంభవించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


