రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పంజాబ్ లోని, అమృత్ సర్ ఇతర ప్రాంతాలనుంచి వ్యవసాయదారులు ఢిల్లీ వైపు కదిలారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఢిల్లీకి పంజాబ్, హర్యానా లనుంచి వచ్చే అన్నిరహదారులు, సరిహద్దులవద్ద బారికేట్లు నిర్మించారు. హర్యానాలోని సిర్సా లోని సర్గుల్ దార్గ్ సరిహద్దును మూసివేశారు. ఢిల్లీలో రేపు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. పంటల కనీస మద్దతు ధర పెంచాలని, మద్దతు ధర కు గ్యారంటీ కల్పిస్తూ చట్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు పలు డిమాండ్ల పరిష్కారంకోసమే.. ఛలో ఢిల్లీ చేపట్టారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 రైతు సంఘాలకు చెందిన రైతులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారని కిసాన్ మోర్చా నాయకుడు జగ్జిత్ దల్లేవార్ పేర్కొన్నారు.పోలీసులు బారికేట్లు నిర్మించి ట్రాఫిక్ ను అడ్డుకోవడంతో సరిహద్దుల్లో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించింది. మరో పక్క కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఛలో ఢిల్లీ ఆపేందుకు రైతులతో చర్చలు ప్రారంభించింది.