స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. అవినాశ్ రెడ్డితో పాటు డాక్టర్లను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరోవైపు కర్నూలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి కర్నూలులో ఉన్న సీబీఐ అధికారులు దాదాపు 8గంటల పాటు జిల్లా ఎస్పీతో చర్చించారు. అవినాశ్ అరెస్టుకు స్థానిక పోలీసులు సహకరించకపోవడంతో కేంద్ర బలగాలను కర్నూలుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు CRPF ఐజీతో అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించే వరకు తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీంతో రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ విచారించనుంది.