2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘెర ఓటమి పాలైంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది. అనూహ్యంగా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక రాగా.. గెలిచేందుకు వైసీపీ అధినేత జగన్ మాస్టర్ ప్లాన్ వేశాడని అంటున్నారు. విశాఖ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు.. సీనియర్ నేత బొత్సను బరిలోకి దింపారని చెబుతున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను గెలిచి.. చంద్రబాబు ప్రభుత్వానికి తొలి సవాల్ విసరాలని వైసీపీ భావిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే.. వైసీపీలో అత్యంత సమర్థుడైన అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను రంగంలోకి దింపింది. స్థానిక సంస్థల్లో మెజార్టీ ఉన్నప్పటికీ.. ప్రతికూల సమయంలో విజయబావుటా ఎగరేసేందుకు .. సర్వం సిద్ధంగా ఉన్నామని వైసీపీ అంటోంది.
విశాఖ స్థానిక సంస్థల ఎన్నిక ఈనెల 30న జరగనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75 శాతం బలం ఉండగా, అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. గతంలో విశాఖ స్థానిక సంస్థల కోటా నుంచి వైసీపీ తరపున వంశీ కృష్ణయాదవ్ విజయం సాధించారు. అయితే ఎన్నికల ముందు అయన వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా వంశీకృష్ణ యాదవ్ విజయం సాధించారు. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్తానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది.
ఈ నేపథ్యంలో అధికార పక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో.. నామినేషన్ల ప్రకియ్రకు వారం సమయం ఉండగానే .. తమ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను.. జగన్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోవాలంటే.. విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వైసీపీ పావులు కదుపుతోంది. మాజీ మంత్రి బొత్సను బరిలోకి దింపడం ద్వారా .. పార్టీలోని వలసలకు బ్రేక్ వేయొచ్చు అనేది వైసీపీ వ్యూహం. 15 ఏళ్ల మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన బొత్సకు ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ అనుచర గణం ఉంది. అందుకే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యూహాత్మకంగా .. జగన్ ఎంపిక చేశారంటున్నారు.
వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ స్కెచ్ వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు.. ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా స్థానిక సంస్థల శాసనమండలి ఓటర్లే. ఈ జిల్లాలో ఎన్‌డీఏ కూటమికి మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, విశాఖ, అనకాపల్లి ఎంపీలు కూటమికి చెందిన నేతలే. టీడీపీకి గతంలో ఉన్న ఓట్లతోపాటు కొత్తగా చేరిన వారితో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కొట్టిపడేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లను చేర్చుకుంటే ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం పెద్ద పనేమీ కాదంటున్నారు పరిశీలకులు.
కూటమి తరఫున ఎవరైనా ఈజీగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న నేతలకు చెక్ చెప్పేలా… వైసీపీ బొత్సను రంగంలోకి దింపి రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ కూటమిని ఎదుర్కొనే అంగ, అర్ధ బలాలు ఉన్న నేత బొత్స ఒక్కరేనని పార్టీ నేతలంతా జగన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆగస్టు 30న జరిగే ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. ఇప్పటివరకు టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించలేదు. వైసీపీపై పైచేయి సాధించేందుకు టీడీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది..? ఎవరిని అభ్యర్థిగా రంగంలోకి దింపనుందనేది ఆసక్తికరంగా మారింది.