తెలంగాణలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఎన్నికలకు నెల రోజుల గడువు కూడా లేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. బీఆర్‌ఎస్ ఓట్ బ్యాంక్‌ను తమకు అనుకూలంగా మరల్చుకోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు పోతోంది. తెలంగాణ లో మొత్తం 17 లోక్‌సభ సెగ్మెంట్లలో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. సారాకే సారా … సత్రా హమారా …అనే నినాదంతో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. ఎన్నికల ప్రచారం కోసం పక్కా ప్రణాళిక రూపొందించారు కమలనాథులు. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు రంగంలోరి దిగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు తెలంగాణకు రానున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. 30న జహీరాబాద్ లోక్‌సభ పరిధి లోని ఆంధోల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రి శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో నరేంద్ర మోడీ సమావేశమవుతారు. ఆ తరువాత మే నెల మూడో తేదీన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. అదేరోజు భువనగిరి, నల్లగొండ బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఆ తరువాత నాలుగోతేదీన నారాయణపేట, వికారాబాద్ బహిరంగ సభలకు కూడా ఆయన హాజరవుతారు. తన పర్యటనలతో బీజేపీ క్యాడర్లో జోష్ పెంచుతారు ప్రధాని నరేంద్ర మోడీ.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఆయుధంగా చేసుకుని ప్రజల్లోకి వెళుతోంది భారతీయ జనతా పార్టీ.ఇటు నాలుగు నెలల కాంగ్రెస్ వైఫల్యాలను, అటు పదేళ్ల కేసీఆర్ పాలనలోని లోపాలను జనంలోకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు కమలనాథులు.ప్రధానంగా కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఊరూవాడా ఏకం చేస్తూ ప్రచారం చేయడానికి బీజేపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలో కూడా ఆచితూచి వ్యవహరిం చింది కమలం పార్టీ. మొదట్నుంచి పార్టీని నమ్ముకున్నవారితోపాటు కొత్తగా కాషాయ కండువా కప్పుకున్న వారికి కూడా టికెట్లు ఇచ్చింది. ఒకవైపు ప్రజల్లో బీజేపీకి ఉన్న ఇమేజ్,మరోవైపు సమాజంలో సదరు క్యాండిడేట్‌కు ఉన్న పలుకుబడి పార్టీని, గెలుపు తీరాలకు చేరుస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.
బీజేపీ ఉత్తరాదిన బలంగా ఉన్న సంగతి ఎవరూ కాదనలేరు. అయితే దక్షిణాదిన కమలం పార్టీ బలహీనంగా ఉన్నమాట వాస్తవం.మొత్తం ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట బీజేపీ సర్కార్ లేదు. పైపెచ్చు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇందులో ఒకటి తెలంగాణ కావడం విశేషం. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ తయారు చేసింది. మొత్తం 40 మంది ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నట్లు తెలిసింది. మొన్నటివరకు గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందర్ రాజన్ సహా అనేకమంది సినీ తారలు ఈ జాబితాలో ఉన్నారన్నది రాజకీయ వర్గాల సమాచారం. తమిళిసై దక్షిణ చెన్నై నుంచి పోటీ చేశారు. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణకు ఆమె రానున్నారు.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా సినీ తారలు రాధిక, ఖుష్బూ కూడా ఎన్నికల ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది.తమిళనాడులో ఎన్డీయే కూటమి రాధిక భర్త శరత్ కుమార్ పార్టీ కూడా భాగస్వామ్యపక్షంగా ఉంది. తెలంగాణలో గులాబీ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఒక పక్క వలసలతో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా ? అనే చర్చ నడుస్తూ ఉంటే మరో పక్క కేసీఆర్ కుటుంబాన్ని కేసులు వెంటాడుతున్నాయి. ప్రధానంగా కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు కావడం బీఆర్ఎస్ కు మైనస్ పాయింట్‌గా మారింది. ఇదొక్కటే కాదు. కేసీఆర్ కుటుంబసభ్యులను కేసులు వెంటాడుతున్నాయి.
ఒకవైపు బీఆర్ఎస్ ను మరోవైపు హస్తం పార్టీని టార్గెట్‌గా చేసుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకుపో వాలన్నది కమలనాథులు ప్లాన్‌లాగా కనిపిస్తోంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఇటీవల నరేంద్ర మోడీ నాయక త్వంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలియచేసింది. అలాగే సమ్మక్క – సారలమ్మ పేరుతో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోటల్‌గా తెలంగాణ కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అనేక డిమాండ్లను ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అంశాలన్నీ లోక్‌సభ ఎన్నికల్లో తమకు ప్లాస్ పాయింట్లుగా మారుతాయని భరోసా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.


