25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

కాంగ్రెస్ పై మైండ్ గేమ్ ఆడుతున్న కేసీఆర్

    తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాణక్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యమ కాలంలోనూ ఆయన అనేక ఎత్తుగడలు వేశారు. వ్యూహాలు పన్నారు. అంతిమంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత సాధించారు. వరుసగా రెండు దఫాలు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన భారత్ రాష్ట్ర సమితి ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు నాలుగు నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని గులాబీ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఏ రాజకీయ పార్టీకైనా గెలుపు ఓటములు సహజం. ఇందుకు భారత్ రాష్ట్ర సమితి కూడా మినహాయింపు కాదు. అయితే పులిమీద పుట్రలా గులాబీ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నేతలు వెళ్లిపోవడం ప్రారంభమైంది. వెళుతున్నవారు కూడా చిన్నా చితకా నాయకులు కారు. బీఆర్ఎస్ సర్కార్‌లో పెద్ద పెద్ద పదవులు అనుభవించినవారు. కే.కేశవరావు, కడియం శ్రీహరి లాంటి హేమాహేమీలు ఈ జాబితాలో ఉన్నారు.

    గులాబీ పార్టీ నుంచి వలసలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గేట్లు తెరిచామంటూ ఓపెన్‌గా గులాబీ పార్టీ నేతలకు ఆహ్వానం పలికారు. ఇంకేముంది. బీఆర్‌ఎస్ నుంచి వలసలు జోరందుకున్నాయి. కేటీఆర్‌, హరీశ్ రావు లాంటి నాయకులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వలసలకు బ్రేక్ పడలేదు.వెళుతూ వెళుతూ బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వంపై ఎడాపెడా విమర్శలు చేయడం కూడా మొదలైంది. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నా గులాబీ పార్టీ నాయకులు చాలా మంది ముందుకురాలేదు. ఎన్నికల ఖర్చు కూడా పార్టీయే భరిస్తుందని భరోసా ఇచ్చినా నేతలు ఆసక్తి చూపలేదు. కడియం కావ్య లాంటి వారు చివరి క్షణంలో పోటీ చేయడంలేదంటూ చేతులెత్తేశారు. గులాబీ పార్టీ తన సుదీర్ఘ చరిత్రలో ఇంతటి క్లిష్ట పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కొని ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే భారత్ రాష్ట్ర సమితి ఉనికి ప్రశ్నార్థకం కానుందా ? అనే అనుమానాలు తలెత్తాయి.

    స్వంత పార్టీ ఇంత గడ్డు పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటూ కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ హల్‌చల్‌ చేశారు. తాము ఊ అంటే బీఆర్‌ఎస్‌లో చేరతారని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఈ మేరకు కాంగ్రెస్‌కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు తనకు ఫోన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే తానేఇప్పుడే వద్దంటూ సదరు కాంగ్రెస్‌ నాయకుడిని వారించినట్లు కేసీఆర్ వెల్లడించారు. కథ అక్కడితో ఆగలేదు. ఏడాదిలోగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు కేసీఆర్. పనిలో పనిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టి భారతీయ జనతా పార్టీలో చేరతారని మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఇదిలా ఉంటే కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను పిలిస్తే కాంగ్రెస్ లోకి రావడానికి పాతికమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయ డానికి చేసే కుట్రలను కేసీఆర్ మానుకోవాలన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా, నల్లగొండ, భువనగిరిలో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు రావన్నారు కోమటిరెడ్డి.

    సుదీర్ఘకాలం తరువాత నాలుగు నెలల కిందట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గులాబీ పార్టీ పరాజయానికి అనేక కారణాలున్నాయి. పదేళ్ల కేసీఆర్ పాలనపై తెలంగాణ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే కీలక అంశాన్ని కేసీఆర్ సర్కార్ తుంగలో తొక్కిందని తెలంగాణ సమాజం ఒక అభిప్రాయానికి వచ్చింది. పరీక్షలు నిర్వహించడంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యాన్ని కూడా ప్రజలు గమనించారు. నిరుద్యోగులకు కొలువులు కల్పించడంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నా యంగా వచ్చిన కాంగ్రెస్‌కు జై కొట్టారు తెలంగాణ ప్రజలు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి కేసీఆర్ మైండ్‌గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలోగా పడిపో తుందన్న కేసీఆర్ వ్యాఖ్యను కాంగ్రెస్ వర్గాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. చాలాకాలం తరువాత వచ్చిన హస్తం పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏ కాంగ్రెస్ నాయకుడు సిద్ధంగా లేరన్నది వాస్తవం. ప్రభుత్వం కూలిపోతే, తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియనంత అమాయకులు కారు కాంగ్రెస్ నాయకులు.

    కాంగ్రెస్ సర్కార్‌ను జనంలో బద్నాం చేయడానికి కరువును ఆయుధంగా చేసుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ వస్తూ వస్తూనే రాష్ట్రంలో కరువును తీసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కరువును ఆయుధంగా చేసుకుని కేసీఆర్ తమ ప్రభుత్వంపై దాడి చేయడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చలికాలంలో అని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే ఆగస్టు సంక్షోభం అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తావనకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో వచ్చిన ఆగస్టు సంక్షోభం ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పదవీచ్యుతుడైన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా ఆగస్టు సంక్షోభం వస్తుందన్న సంకేతాలు ఇచ్చారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌. ఏమైనా స్వంత పార్టీని చక్కదిద్దుకోవడం మానేసి, అధికారపక్షంపై కేసీఆర్ మైండ్‌గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్