ఐదవ విడత ఎన్నికల బరిలోకి దిగుతున్న ఎనిమిది రాష్ట్రాలు

    నాలుగో విడత ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐదవ విడత ఎన్నికలపై పడింది. మే 20న దేశవ్యాప్తంగా ఐదవ విడత ఎన్నికలు జరుగుతాయి. ఐదవ విడత పోలింగ్‌కు ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల అధికారులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఐదవ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో భాగం గా 695 అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బీహార్‌, జమ్మూ కాశ్మీర్, ఝార్కండ్, లడఖ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఐదవ విడత ఎన్నికలు జరగబోతున్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 80 సీట్లలో కాంగ్రెస్ ఈ ఒక్కసీటే గెలుచుకుంది. కిందటిసారి ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ గెలుపొందారు. ఈసారి వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీని బరిలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక బీజేపీ టికెట్‌పై సీనియర్ నేత దినేశ్ సింగ్ బరిలో ఉన్నారు. వాస్తవానికి దినేశ్ సింగ్ గతంలో కాంగ్రెస్ శిబిరంలోనే ఉన్నారు. 2019 ఎన్నికల తరువాత దినేశ్ సింగ్ కాంగ్రెస్‌ లో చేరారు. ఇదిలా ఉంటే, 2019 ఎన్నికల తరువాత రాయ్‌బరేలీపై ప్రత్యేక దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను రాయ్‌బరేలీలో విజయవంతంగా అమలు చేయించింది నరేంద్ర మోడీ సర్కార్. దీంతో రాయ్‌బరేలీ సెగ్మెంట్లో క్రమక్రమంగా బీజేపీ బలపడటం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈసారి రాయ్‌బరేలీ నియోజకవర్గంలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఏమైనా గెలుపు కోసం రాహుల్ గాంధీ చెమటోడ్చుతున్నారు.

అమేథీ ఉత్తరప్రదేశ్‌లోని మరో కీలక నియోజకవర్గం. అంతేకాదు. ఇందిర కుటుంబానికి దుర్భేద్యమైన కోటలాంటిది అమేథీ నియోజకవర్గం. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీచేసిన రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థినిగా బరిలోకి దిగిన టీవీ నటి స్మృతి ఇరానీ ఇక్కడ్నుంచి గెలుపొందారు. అయితే ఈసారి అటు రాయ్‌బరేలీ లేదా ఇటు అమేథీ నుంచి రాహుల్ పోటీ చేస్తారన్న వార్తలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రాయ్‌బరేలీ అలాగే అమేథీ నియోజకవర్గాలతో ఇందిర కుటుంబానికి ఉన్న అనుబంధమే. ఈ రెండు నియోజకవర్గాలతో ఇందిర కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది. దీంతో తర్జనభర్జనల అనంతరం అమేథీ నియోజకవర్గానికి కాంగ్రెస్ టికెట్‌ను కిశోరీలాల్ శర్మ కు ఇచ్చారు. రాజకీయవర్గాల్లో కే ఎల్ శర్మ గా ప్రముఖుడైన కిశోరీలాల్ శర్మ హస్తం పార్టీలో సీనియర్ నేత. అంతేకాదు. సోనియా గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. ఇటు రాయ్‌బరేలీ అటు అమేథీ ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కిశోరీలాల్ శర్మకు గట్టి పట్టుంది.

బీజేపీ టికెట్‌పై మరోసారి సిట్టింగ్ ఎంపీ, టీవీ నటి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాహుల్ గాంధీపై గెలుపొందారు. దీంతో స్మృతి ఇరానీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈసారి కూడా విజయం తమదే అంటున్నారు స్మృతి ఇరానీ. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా బీహార్‌లోని ఐదు నియోజకవర్గాల్లో ఈనెల ఇరవైన పోలింగ్ జరగనుంది. ఐదు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హాజీపూర్దే శమంతా పాపులర్ అయిన నియోజకవర్గం. హాజీపూర్‌ దివంగత నేత రాం విలాస్ పాశ్వాన్‌కు కంచుకోట. ఇక్కడ్నుంచి రాం విలాస్ పాశ్వాన్ ఎనిమిది సార్లు గెలుపొందారు. ఈసారి లోక్‌ జనశక్తి టికెట్‌ పై రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పోటీలో ఉన్నారు.

చిరాగ్ పాశ్వాన్ గతంలో జముయి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి జముయి సెగ్మెంట్‌ను వదులు కుని హాజీపూర్ వచ్చారు. తమ కుటుంబానికి పెట్టని కోటలాంటి హాజీపూర్‌లో ఈసారి సత్తా చాటాలని చిరాగ్ పాశ్వాన్ ఉబలాటపడుతున్నారు. కాగా రాష్ట్రీయ జనతాదళ్‌ నుంచి శివచంద్ర రామ్ తలపడుతున్నారు. దళిత వర్గాల్లో శివ చంద్ర రామ్‌ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపే తనను విజయ తీరాలకు చేరుస్తుందన్న బలంగా నమ్ముతు న్నారు శివచంద్ర రామ్. సారణ్‌ …బీహార్‌లోని మరో కీలక నియోజకవర్గం. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పుట్టిన నేల సారణ్‌. గతంలో ఈ నియోజకవర్గం ఛాప్రా పేరుతో ఉండేది. అయితే డీ లిమిటేషన్ తరువాత సారణ్ గా మారింది. 1977లో లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్లమెంటు రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడ్నుంచే మొదలెట్టారు. సారణ్ లో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేది భోజ్‌పురి భాష. సారణ్ సెగ్మెంట్‌లో రైల్వేలకు సంబంధించిన అనేక ఫ్యాక్టరీలున్నాయి.

   సారణ్‌ నుంచి 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ గెలుపొందారు. దాణా కుంభకోణంలో లాలూకు శిక్ష పడటంతో ఆయన పదవి కోల్పోయారు. ఆ తరువాత 2014లో నరేంద్ర మోడీ ప్రభంజనంలో బీజేపీ టికెట్‌ పై పోటీ చేసిన రాజీవ్ ప్రతాప్ రూఢీ విజయం సాధించారు. 2019లోనూ రాజీవ్ ప్రతాప్ రూఢీ గెలుపొందారు. దీంతో నియోజకవర్గంపై లాలూ ప్రసాద్ యాదవ్ పట్టు తగ్గినట్లయింది. ఈసారి ఎన్నికల్లో లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆర్జేడీ టికెట్‌పై బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఉన్న పట్టు తనను గెలిపిస్తుందని రోహిణి నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ కూడా గెలుపుపై భరోసాతో ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో సారణ్‌ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పథకాలను అమలు చేయించానని అంటున్నారు రాజీవ్ ప్రతాప్ .

  సీతామఢీ ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. నేపాల్ సరిహద్దుల్లో ఉంటుంది ఈ నియోజకవర్గం. సీతామఢీని సీతాదేవి పుట్టిన ప్రాంతంగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. 2014లో ఇక్కడ ఎన్డీయే కూటమి విజయం సాధించింది. కాగా 2019 వచ్చే నాటికి నియోజకవర్గంలో రాజకీయ లెక్కలు మారిపోయాయి. 2019 ఎన్నికల్లో జేడీ యూ గెలిచింది. ఈసారి సీతామఢీ నుంచి రాష్ట్రీయ జనతాదళ్ టికెట్‌పై అర్జున్ రే పోటీ చేస్తున్నారు. జేడీయూ నుంచి దేవేశ్ చంద్ర ఠాకూర్ బరిలో ఉన్నారు. కాగా బీఎస్సీ నుంచి భోలా సింగ్ పోటీలో ఉన్నారు. సీతామఢీ నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు న్నాయి. ఇందులో మూడు సెగ్మెంట్లు బీజేపీ చేతుల్లో ఉన్నాయి. దీంతో బీజేపీతో పొత్తులో ఉన్న జేడీ యూ అభ్యర్థి దేవేశ్ చంద్ర ఠాకూర్ గెలుపు పై ధీమాతో ఉన్నారు. బీహార్ ఉత్తర ప్రాంతంలోని మధుబనీ నియోజకవర్గం . మిధిల సంస్కృతికి కేంద్రంగా ఉంది. ప్రముఖ కవి కాళిదాస్‌ జన్మస్థలంగా మధుబనీ నగరానికి పేరుంది. అంతేకాదు. పెయిం టింగ్స్ కు మధుబనీ నగరం దేశవ్యాప్తంగా పాపులర్‌. 2014, 2019లలో మధుబనీ నియోజకవర్గం నుంచి బీజేపీ విజయం సాధించింది. ఈసారి బీజేపీ టికెట్‌పై అశోక్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన హుకుందేవ్ నారాయణ్ యాదవ్ కుమారుడే అశోక్ యాదవ్. కాగా రాష్ట్రీయ జనతా దళ్ తరఫున అలీ అష్ట్రాఫ్ ఫాత్మీ పోటీ చేస్తున్నారు. ఈసారి మజ్లిస్ పార్టీ కూడా ఇక్కడ పోటీలో ఉంది. మజ్లిస్ టికెట్‌పై వకార్ సిద్దీఖీ బరిలో నిలిచారు.

   ముజఫర్‌పూర్ గతంలో ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు విప్లవకారుడు ఖుదీరాం బోస్ స్వస్థలం ముజఫర్‌పూర్. 2014,2019 లో ముజఫర్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అజయ్ నిషాద్ గెలిచారు. అయితే ఈసారి అజయ్ నిషాద్ కాంగ్రెస్ టికెట్‌ పై బరిలో ఉన్నారు. కాగా కిందటిసారి మహాఘట్‌బంధన్‌ నుంచి పోటీ చేసిన రాజ్‌భూషన్‌ చౌధురి ఈసారి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. వాస్తవానికి ముజఫర్‌పూర్. బాగా వెనుకబడ్డ ప్రాంతం. ఇక్కడ ముస్లింలు, అగ్రకులాల వారు జయాపజయాలను నిర్ణయిస్తారు. బీజేపీ అభ్యర్థి అజయ్ నిషాద్ కు స్థానికంగా బలముంది. రెండు దఫాలు వరుసగా ఎంపీగా గెలవడంతో నియోజకవర్గంలో అజయ్ నిషాద్‌కు పట్టు పెరిగింది. ఈ నేపథ్యంలో అజయ్ నిషాద్ తన గెలుపుపై భరోసాతో ఉన్నారు. ఝార్కండ్ ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఎవరూ చెప్పలేరు. గతంలో మాదిరిగానే ఇక్కడి ఫలితాలను ప్రస్తుతం కూడా అంచనా వేయడం కష్టం. ఈనెల ఇరవైన ఝార్కండ్‌ లోని మూడు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. చత్రా నియోజకవర్గం. ఇది ఝార్కండ్ ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. దళితులు, ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన తరగతుల వారు చత్రా నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉంటారు. నియోజకవర్గంలోని ప్రజల్లో ఎక్కువమంది గ్రామీణ పేదలే. చత్రా నియోజకవర్గంలో నక్సలైట్ల ప్రాబల్యం కూడా ఎక్కువ.

చత్రా నియోజకవర్గం. ఒకప్పుడు రాష్ట్రీయ జనతాదళ్‌కు పెట్టనికోట. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. చత్రా నియోజకవర్గంలో ఈసారి 22 మంది పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కాళీ చరణ్ సింగ్, కాంగ్రెస్ టికెట్‌పై కృష్ణానంద్ త్రిపాఠీ బరిలో ఉన్నారు. 2014,2019 లలో చత్రా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. హజారీబాగ్‌ అపార బొగ్గు నిల్వలకు కేంద్రం ఈ నియోజకవర్గం. హజారీబాగ్‌ ప్రాంతం కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు బాగా పట్టున్న ప్రాంతం. 2014,2019 ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా భారీ మెజారిటీలతో గెలిచారు. అయితే ఈసారి జయంత్ సిన్హాకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. మనీశ్ జైశ్వాల్ అనే నాయకుడికి టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది కమలం పార్టీ. ఇక హస్తం పార్టీ తరఫున జై ప్రకాశ్‌ భాయ్ పటేల్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనీశ్ జైశ్వాల్‌కు జయంత్ సిన్హా ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నగా మారింది.

జనాభా లెక్కలు తీస్తే నియోజకవర్గంలో ముస్లింలు 15 శాతం ఉంటే, దళితులు కూడా 15 శాతం ఉన్నారు. ఇక ఆదివాసీలు 12 శాతం ఉన్నారు. హజారీబాగ్‌ కు సంబంధించి మరో విశేషం ఉంది. హజారీబాగ్‌ ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. పర్యాటక ప్రాంతంగానూ హజారీబాగ్‌కు పేరుంది. మౌలికంగా వెనుకబడిన ప్రాంతమైనప్పటికీ హజారీబాగ్‌లో విద్యావంతులు ఎక్కువ. ఈ నియోజకవర్గంలో 70 శాతానికి పైగా అక్షరాస్యత ఉంది. కోడర్మా ఈనెల 20న పోలింగ్ జరగనున్న మరో నియోజకవర్గం ఇది. 1977లో కోడర్మా నియోజకవర్గం ఏర్పడింది. కోడర్మా సెగ్మెంట్ సంప్రదాయంగా బీజేపీకి అండగా ఉంటూ వస్తోంది. ఇప్పటివరకు ఏడు సార్లు కోడర్మా నియోజకవర్గం నుంచి కమలం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి బీజేపీ టికెట్‌పై సిట్టింగ్ ఎంపీ అన్నపూర్ణాదేవి బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ మార్క్సిస్టు, లెనినిస్టు లిబరేషన్ అభ్యర్థి వినోద్‌ కుమార్ సింగ్ పోటీ చేస్తున్నారు. కోడర్మాలో ముస్లింలు 19 శాతం మంది ఉన్నారు. అలాగే 14 శాతం మంది దళితులు, ఎనిమిది శాతం మంది ఆదివాసీలు ఉన్నారు. కోడర్మా నియోజకవర్గంలో బీజేపీపై నియోజకవర్గంలో అసంతృప్తి కనిపిస్తోంది. ఉద్యోగాల కల్పన, ధరల నియంత్రణ, అభివృద్దిపై ఇచ్చిన హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంప్రదాయ ఓట్‌బ్యాంక్‌పై బీజేపీ ఆధారపడుతోంది. కాగా హేమంత్ సోరేన్‌ పై సానుభూతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు తమను గెలుపు తీరాలకు చేరుస్తాయని ఇండియా కూటమి భావిస్తోంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్