స్వతంత్ర వెబ్ డెస్క్: నాగ్ పూర్ – అమరావతి గ్రీన్ఫీల్డ్హైవే అలైన్మెంట్(Greenfield Highway Alignment) మార్చాలని డిమాండ్చేస్తూ రఘునాథపాలెం(Raghunathapalem), చింతకాని(Chintakani) మండలాల్లోని గ్రామాల రైతులు ఖమ్మం(Khammam) కలెక్టరేట్ముందు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కోకాపేట ఎకరం రూ.100 కోట్లు పలుకుతోందని గొప్పలు చెబుతున్న కేసీఆర్(KCR), తమ భూములకు కేవలం ఎకరాకు రూ.25లక్షలు నష్ట పరిహారం ఇస్తామనడం దారుణం అన్నారు. తమ మొరను ఆలకించని కేసీఆర్ కు రైతుల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిహారం వద్దని, భూములు కోల్పోకుండా చూస్తే చాలని చెప్పారు. రైతులకు అఖిల పక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపి కలెక్టరేట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( Tammineni Veerabhadram), సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Koonanneni Sambasivarao) మాట్లాడుతూ.. పోలీస్బందోబస్తు నడుమ సర్వే చేసి, బలవంతంగా భూములు లాక్కోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరివి నుంచి కోదాడకు, కోదాడ నుంచి అమరావతికి బ్రహ్మాండమైన రోడ్డు ఉందని, కొత్త హైవేతో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. కేవలం 12, 13 కిలోమీటర్లు దూరం తగ్గుతుందని, ఇంత మంది రైతులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు.