తిరుమల లడ్డూ వివాదంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు సహా ఇతర పదార్థాలు కలిపారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇదే అంశంపై తమ వద్ద రిపోర్ట్‌లు సైతం ఉన్నాయని ప్రకటించారు టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి. అయితే.. ఈ ఏడాది జులై 24న టీటీడీ నూతన ఈవో శ్యామలరావు కీలక ప్రకటన చేశారు. లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాట్ అంటూ ప్రకటించారు. విషయం తెలిసిన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు టీటీడీ ఈవో.
తిరుమల లడ్డూలో జంతువుల నూనె కలిసింది అనే సమాచారం తనకు తెలిసిందని ఇప్పటికే వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఇదే సమయంలో ఈవో రెండు నెలల క్రితమే… లడ్డూలో కలిసింది వెజిటబుల్ ఫ్యాట్ అని.. అయినా సరే ఏ మాత్రం రాజీపడకుండా సంబంధిత కాంట్రాక్టర్‌పై, సంస్థపై చర్యలు తీసుకున్నట్లు స్వయంగా వెల్లడించారు.
ఓవైపు చూస్తే ఆరోపణలు గుప్పిస్తోంది ముఖ్యమంత్రి… టీడీపీ నేతలు. మరోవైపు క్లారిటీ ఇచ్చింది స్వయంగా టీటీడీ ఈవో. అది కూడా రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూలో వచ్చిన వెజిటబుల్ ఫ్యాట్.. వెంటనే గుర్తించి తీసుకున్న చర్యలు గురించి చెప్పారు. ఇదంతా గమనిస్తే.. అసలు లడ్డూ వివాదంలో వాస్తవం ఏంటి…? ఎవరి హయాంలో ఏం జరిగింది…? ఎవరి మాట నమ్మాలి.. ? ఏది నిజమని అనుకోవాలి అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకంలో బలంగా విన్పిస్తున్నాయి.