కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ పూర్తిగా ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ ఏడాది పాలనకు రిఫరెండం అంటూ ప్రచారం చేస్తూ గ్రాడ్యుయేట్లకు గాలం వేస్తుంది. బీఆర్ఎస్ కాడిని పడేయడంతో ఆ ప్లేస్‌లోకి బీజేపీ వేగంగా దూసుకొని పోతుంది. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ సరికొత్త వ్యూహంతో దూసుకెళ్తుంది. మరి బీజేపీ వ్యూహాలు ఇక్కడ ఫలిస్తాయా? అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా?
తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య కీలక పోరు జరుగుతోంది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తూ.. మూడింటినీ గెలవాలనే పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ మాత్రం కేవలం కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తుంది. మరో ఐదు రోజుల్లో ఈ ఎన్నికల జరుగనుండటంతో బీజేపీ, కాంగ్రెస్ పూర్తి దృష్టి పెట్టాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఓటమి భయంతో ముందే తప్పుకుందని రెండు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతానికి బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండటంతో.. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు రెఫరెండంగా బీజేపీ ప్రచారం చేస్తుండటంతో కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కమలం పార్టీ ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దింపింది. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ 20 మంది ఓటర్లకు ఒక ఇంచార్జిని పెట్టి జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టి.. ప్రచారం చేస్తున్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతీ 100 మందికి ఒక ఇంచార్జిని పెట్టింది బీజేపీ. ఏ ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దని.. గతంలో హుజూరాబాద్, దుబ్బాక, నాగార్జునసాగర్, మునుగోడులో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ.. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్‌ను ఓడించడానికి గట్టిగానే కష్టపడింది. హుజూరాబాద్, దుబ్బాకలో గెలిచి మిగిలిన రెండు చోట్ల ఓడిపోయింది. అయినా సరే ఆ ఎన్నికలు బీజేపీకి తెలంగాణలో పుంజుకోవడానికి ఉపయోగపడ్డాయి. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి అప్పటి బై ఎలక్షన్లే కారణమని భావిస్తుంది.
ఇప్పుడు కూడా అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడాలని భావిస్తుంది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రజలకు సందేశం పంపడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తోడ్పడుతుందని అంచనా వేస్తుంది. అందుకే ఈ మూడు ఎన్నికలను కూడా బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. సాధారణంగా ఏ పార్టీ అయినా గ్రాడ్యుయేట్ ఎన్నికలపైనే ఫోకస్ పెడుతుంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉపాధ్యాయ సంఘాలకే వదిలేస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తూ.. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను వదిలేసింది. గతంలో ఎవరో ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్.. ఈ సారి స్వయంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్థన్ రెడ్డి పోటీ చేస్తున్నా.. మద్దతు ప్రకటించలేదు. అలాగే కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా కాంగ్రెస్ లైట్ తీసుకుంది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేవలం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనే ఢీ అంటే ఢీ అంటున్నాయి. అందుకే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి అన్ని రకాల వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తుంది. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలను బీజేపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మరోవైపు క్షేత్రస్థాయిలో కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని ఏకం చేసి.. ప్రచారంలో భాగస్వాములను చేస్తుంది. ఇది తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మైనస్‌గా మారనుంది.
కాంగ్రెస్ టికెట్ ఆశించి.. టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే బీఎస్పీ అభ్యర్థి కాంగ్రెస్ ఓట్లనే చీలుస్తారని.. అంతిమంగా అది బీజేపీకే లబ్ది చేస్తుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతీ 100 మందికి నియమించిన ఇంచార్జి ఎప్పటికప్పుడు ఓటర్లను కలుస్తూ.. వారు వేరే అభ్యర్థి వైపు ఆకర్షించబడకుండా చూస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి బీజేపీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఈ ఎన్నికలే తెలంగాణలో బీజేపీ భవిష్యత్‌కు బాటలు వేస్తాయని నమ్ముతుండటంతో తీవ్రంగా కష్టపడుతుంది. మరి చివరకు బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో వేచి చూడాలి.