23.7 C
Hyderabad
Tuesday, March 25, 2025
spot_img

ఇండియాలో యూఎస్‌ ఎయిడ్‌ నిధులు వృథా అంటున్న ట్రంప్‌.. అసలు ఈ యూఎస్‌ ఎయిడ్‌ అంటే ఏమిటి?

ఉదారంగా మేముందుకు నిధులు ఇవ్వాలి..? ఇది ట్రంప్ వాదన..! ఎవరైనా ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తారు..? ఇవ్వరు కదా..? కానీ గతంలో అమెరికా ఇచ్చిందంటున్నారు ట్రంప్. ఎవరికో కాదు.. ఇండియాకే ఊరికే డబ్బులు ఇచ్చిందట అమెరికా. అప్పుడలా నడిచింది కానీ ఇప్పుడు నడవదంటున్నారు ట్రంప్. మస్క్ చూసిన లెక్కల్లో ఇండియాలో పెద్ద బొక్కఉందని కనిపెట్టి చెప్పగా.. ట్రంప్ దాన్ని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరి మస్క్ చూసిన లెక్కలేంటి? ఇండియాలో ఆయన కనుగొన్న బొక్కేంటి..? ట్రంప్ చేస్తున్న హంగామా ఏంటి?

యూఎస్ ఎయిడ్.. ఈ విభాగం నుంచే మిలియన్ల కొద్ది డాలర్లు ఇండియాకి వచ్చాయి. స్వయంగా అమెరికా ప్రభుత్వమే భారత్ ప్రభుత్వానికి కొన్నేళ్లుగా ఇస్తూ పోయింది. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని ఈ డబ్బులు.. ఇండియాకు మాత్రమే కాదు.. ఆసియాలోని మరికొన్ని దేశాలకు కూడా చేరినట్లు డోజ్ లెక్కలు చెబుతున్నాయి. మరి యూఎస్ మిలియన్ల అమెరికన్ డాలర్లను ఇండియాలో ఎందుకు కుమ్మరించింది..? ఇచ్చిన డబ్బులను భారత్ ఏం చేసింది..?

యూఎస్ ఎయిడ్… అమెరికా ప్రభుత్వంలో ఇది ఒక విభాగం. విదేశాల్లో సేవా కార్యక్రమాలు.. మిత్రదేశాల్లో సామాజిక, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అమెరికా ప్రభుత్వంలో ఉండే ఈ యూఎస్ ఎయిడ్ విభాగం పనిచేస్తుంది. అమెరికా ప్రభుత్వం తరపున మానవతా సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికి 1960 ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ స్థాపించబడింది. ఈ విభాగంలో 2024 డిసెంబర్ నాటికి దాదాపు 10వేల మంది పనిచేస్తున్నారని అంచనా. వీరిలో మూడింట రెండొంతుల మంది విదేశాలలో పనిచేస్తున్నారని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ తెలిపింది. యూఎస్ ఎయిడ్ 60 కంటే ఎక్కువ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పేద దేశాల్లో యూఎస్ ఎయిడ్ విస్తృతమైన సేవలను అందిస్తోంది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్న దేశాలలో యూఎస్ ఎయిడ్ ఆహారాన్ని సరఫరా చేస్తోంది.

యూఎస్ ఎయిడ్ బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఆరోగ్య కార్యక్రమాలపై ఖర్చు చేస్తోంది. పోలియో వ్యాధి ఇప్పటికీ వ్యాప్తి చెందుతున్న దేశాలలో టీకాలు అందించడం, ప్రాణాంతక వైరస్ ల కట్టడికి చేయాల్సిన పరిశోధనలకు యూఎస్ ఎయిడ్ నిధులు సమకూర్చుతూ వస్తోంది. అమెరికా ట్రెజరీ విభాగ వివరాల ప్రకారం 2023లో యూఎస్ ఎయిడ్ 68 బిలియన్లను ఖర్చు చేసింది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఆదాయంలో ఏడాదికి 0.06శాతం నిధులను యూఎస్ ఎయిడ్ కేటాయిస్తున్నట్లు ట్రెజరీ లెక్కలు చెబుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ప్రధానంగా ఆసియా,ఆఫ్రికాలోని పేదదేశాల్లో మానవతా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తోంది యూఎస్ ఎయిడ్.

ప్రపంచంలో మానవతా సాయం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న మొదటి దేశం అమెరికానే..! బ్రిటన్ అమెరికా ఖర్చు చేస్తున్న దాంట్లో నాలుగవ వంతు ఖర్చు చేస్తుంది. ఇలా అభివృద్ధి చెందిన దేశాలు.. పేద దేశాల్లో మానవతా సాయం కోసం వార్షిక బడ్జెట్ లో కొంత మొత్తాన్ని ఉదారంగా ఇచ్చేస్తున్నాయి. ఈ నిధులు కేవలం ఆహారం, మందుల సరఫరా కోసం మాత్రమే కాదు. ఆయా దేశాల్లో సుస్థిర పాలన, ప్రజాస్వామిక పాలన ఏర్పడేందుకు కూడా అమెరికా ప్రభుత్వం విభాగమైన యూఎస్ ఎయిడ్ ఖర్చు చేస్తోంది. అయితే ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రెజరీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు తన ముఖ్య అనుచరుల్లో ఒకరైన ఎలాస్ మస్క్ కు ట్రెజరీ బాధ్యతలను అప్పగించారు ట్రంప్. మస్క్ అధ్యక్షతన డోజ్ పేరుతో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ట్రంప్ ఆమోదముద్ర వేశారు. ట్రెజరీలోకి మస్క్ ఎంట్రీతో లెక్కలు అన్ని బయటపడటం ప్రారంభమైంది. ట్రెజరీ నుంచి ఏ విభాగానికి ఎన్ని నిధులు వెళుతున్నాయి..? ఎక్కడకు వెళుతున్నాయి..? ఎందుకు వెళుతున్నాయి..? ఎందుకు ఖర్చు చేస్తున్నారన్నారన్న ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి ట్రంప్ ముందుంచారు మస్క్. ఆయా విభాగాల్లో నిధులు దుర్వినియోగం జరుగుతుందని గుర్తించినా… యూఎస్ ఎయిడ్ లోనే అత్యధిక నిధులు దుర్వినియోగం జరుగుతోందని తేలింది.

ఇంత పెద్ద మొత్తంలో ఇతరదేశాలకు నిధులు ఎందుకు ఇవ్వాలన్నది ట్రంప్ వాదన. ఇన్ని డబ్బులు అమెరికా ఆయా దేశాలకు ఇస్తే.. ఆ దేశాల నుంచి అమెరికాకు వచ్చే లాభమేంటని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశంగా ఏళ్లుగా అమెరికా ఈ నిధులను ఆఫ్రికా, ఆసియా దేశాలకు అందించడం ద్వారా ఆయా దేశాల్లో ప్రజలు వ్యాధులు బారిన పడకుండా అమెరికా ఆపన్నహస్తం అందిస్తుందని సామాజిక వేత్తలు అంటున్నారు. ఈ నిధులను నిలిపివేయడం ద్వారా అమెరికాకు కొన్ని డాలర్లు ఆదా అయినా.. దాని పర్యయవసానంగా కొన్ని దేశాల్లో ప్రజల ప్రాణాలు పోతాయని అంటున్నారు.

అయితే మస్క్ బృందం మాత్రం యూఎస్ ఎయిడ్ వెనుక అతిపెద్ద అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. ఆ అవినీతి ఆయా దేశాల్లో రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉందన్నది డోజ్ వాదన. అయితే అది అటు తిరిగి.. ఇటు తిరిగి ఇండియా మీదకు వచ్చింది. ఇండియాలో యూఎస్ ఎయిడ్ పెద్దఎత్తున నిధులు ఖర్చు చేసిందని.. అదంతా వృధా ఖర్చు అంటూ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ ఆరోపణలే భారత్ లో రాజకీయ విమర్శలకు కారణమవుతున్నాయి. ఏకంగా ట్రంప్ ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్