కేరళ జీఎస్టీ అధికారి ఇంట్లో మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి. కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న మనీశ్ విజయ్, ఆయన తల్లి, సోదరి మృతి చెందడం సంచలనం రేపింది. అయితే దీన్ని ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆఫీసుకు నాలుగు రోజులు సెలవు పెట్టి మనీష్ విజయ్ తిరిగి రాకపోవడంతో సహోద్యోగులు ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మనీష్ విజయ్.. ఎందుకు రావడం లేదని తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మనీశ్, అతడి సోదరి షాలిని మృతదేహాలు రెండు వేర్వేరు గదుల్లో ఉండగా.. మంచంపై అతడి తల్లి మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉన్నాయి.
వృద్ధురాలిని తెల్లటి గుడ్డలో చుట్టి పువ్వులు ఆమె పక్కన పెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. దీన్ని బట్టి ముందుగా తల్లి చనిపోయి ఉండొచ్చు లేదా ఆమెను ముందుగా చంపేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత తోబుట్టువులు ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఓ గదిలో ఒక డైరీని పోలీసులు గుర్తించారు. అందులో విదేశాల్లో నివసిస్తున్న వారి సోదరికి వారి మరణం గురించి తెలియజేయాలని రాసి ఉంది.
జార్ఖండ్‌కు చెందిన ఈ కుటుంబం కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కక్కనాడ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లో నివసిస్తోంది. మనీష్ గతంలో కోజికోడ్ విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. తర్వాత గత ఏడాదిన్నర క్రితం కొచ్చికి బదిలీ అయ్యాడు. అతని తల్లి, సోదరి కొన్ని నెలల క్రితం మనీశ్ దగ్గరకు వచ్చి ఉంటున్నారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. షాలిని జార్ఖండ్‌లో ఓ చట్టపరమైన కేసును ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం మనీశ్ గత కొన్ని రోజులుగా సెలవులో ఉన్నాడు.
షాలిని డిప్యూటీ కలెక్టర్‌గా..
2006 జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) పరీక్షలో షాలిని మొదటి స్థానంలో నిలిచిందని.. డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారని తెలుస్తోంది. అయితే, ఆమె ర్యాంకును తరువాత సవాలు చేసి రద్దు చేశారు. దీని ఫలితంగా ఆమెను పదవి నుంచి తొలగించారు. 2024లో, ఈ కేసుపై సీబీఐ విచారణలో భాగంగా చార్జిషీట్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతోంది.
విదేశాల నుంచి మరో సోదరి వచ్చిన తర్వాత మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.