తన తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అమ్మ అస్వస్థతగా ఉందని, ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురైందని వైద్యులు చెప్పారు. ఆమె ఇప్పుడు హుషారుగా , సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని చిరంజీవి ట్వీట్ చేశారు. తన తల్లి ఆరోగ్యంపై ఊహాజనిత వార్తలను రాయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజాగా మీడియాలో వచ్చిన వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘మా అమ్మ గారి ఆరోగ్యం బాగా లేదని, హాస్పిటల్‌లో చేర్పించామని మీడియాలో వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఆమె అస్వస్థతకు గురయ్యారు. కానీ ఆమె ప్రస్తుతం క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మా అమ్మ గారి ఆరోగ్యం గురించి ఎలాంటి రూమర్లను మీడియా ప్రచురించొద్దని మనవి చేసుకుంటున్నాను’అని అన్నారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ వైరల్ అయింది.
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ ఆరోగ్యం మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అంజనమ్మకు అస్వస్థత అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రకరకాల కథనాలను ప్రసారం చేశారు. ఇప్పటికే ఆ వార్తలను ఖండిస్తూ చిరంజీవి టీమ్ ఓ పోస్ట్ పెట్టింది. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లినట్టు ప్రకటనలో వెల్లడించారు. అనవసరంగా అవాస్తవాలను ప్రచారం చేయొద్దని సూచించారు.
తల్లి అంజనమ్మ అంటే చిరంజీవికి చాలా ప్రేమ. ఆమె పుట్టినరోజు వేడుకలైనా, ఆమెకు చిరంజీవి విషెస్ చెప్పే వీడియోలు, ఆమె వంటలు చేసే వీడియోలు.. ఇలా అంజనమ్మకు సంబంధించిన వీడియోలను చిరంజీవి తన ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి తన తల్లి ఆరోగ్యంపై అవాస్తవాలు ప్రచారం జరగడంపై ఒక విధంగా చిరంజీవి సీరియస్‌గా స్పందించారనే చెప్పాలి.