మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు అంటే 2019,మార్చి 15న ఆయన తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటు అని వైసీపీ నేతలు చెప్పారు. అనంతరం గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని వెలుగులోకి వచ్చింది. అనంతరం టీడీపీ నేతలే వివేకాను హత్య చేయించారని అప్పటి ప్రతిపక్షనేత జగన్ తో పాటు వైసీపీ నేతలందరూ తెలిపారు. బాబాయ్ హత్యపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని జగన్ డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కొద్దిరోజులకే ఎన్నికలు జరగడం.. ఆ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచి జగన్ సీఎం అవ్వడం చకచకా జరిగిపోయాయి. జగన్ సీఎం అయిన తర్వాత వివేకా హత్య దర్యాప్తునకు సీబీఐ అవసరం లేదని హైకోర్టులో వేసిన పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు.
అయితే వివేకా కూతురు సునీత సీబీఐ దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు అంగీకరించింది. ఈ కేసులోకి సీబీఐ ఎంటర్ అవ్వడంతో వివేకా హత్య కేసు దర్యాప్తు ముమ్మరమైంది. నాలుగేళ్లుగా విచారణ చేస్తున్న సీబీఐ దర్యాప్తు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. తాజాగా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక ఈ కేసులో నాలుగు సార్లు సీబీఐ విచారణ ఎదుర్కొన్న అవినాశ్ రెడ్డి కూడా త్వరలోనే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్