వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. ఇప్పటికే రెండు రోజుల పాటు విచారించారు పోలీసులు. ప్రతిరోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలీసులు విచారిస్తున్నారు. రెండో రోజులో భాగంగా.. నిన్న దాదాపు 5గంటల పాటు వంశీని విచారించారు. విచారణలో 20 ప్రశ్నలకు పైగానే అడిగారు పోలీసులు. వల్లభనేని వంశీతో పాటు.. లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు వెనుక ఎవరెవరూ ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించారు.
సత్యవర్ధన్‌ను హైదరాబాద్ నుంచి విశాఖకు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు. మొదటిరోజు పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో.. నిన్న టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు అధికారులు. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమ తవ్వకాలు జరిపారా అని వంశీని పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. మైనింగ్‌కి తనకు ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.