అమెరికాలో జరిగిన ఒక ప్రమాదంలో భారతీయ విద్యార్థిని తీవ్ర గాయాలతో కోమాలో ఉంది. ఆమెను కలవడానికి వీసా కోసం మహారాష్ట్రలోని ఆమె కుటుంబ సభ్యులు కేంద్రం సహాయం కోరారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన నీలం షిండే (35)ని ఫిబ్రవరి 14న కారు ఢీకొట్టిందని, ప్రస్తుతం ఆమెను ఐసియులో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
“ఫిబ్రవరి 16న యాక్సిడెంట్ గురించి మాకు తెలిసింది. అప్పటి నుండి వీసా కోసం ప్రయత్నిస్తున్నాము. కానీ మాకు ఇంకా రాలేదు” అని బాధితురాలి తండ్రి తానాజీ షిండే అన్నారు.
తానాజీ షిండేకి వీసా ఇప్పించడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం కోరామని ఎన్‌సిపి (ఎస్పీ) ఎంపి సుప్రియా సులే చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడంలో అందరం కలిసి సహాయపడాలని అన్నారామె. తాను బాధితురాలి కుటుంబ సభ్యలతో మాట్లాడుతున్నానని.. వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పొలిటికల్‌గా జైశంకర్‌తో విభేదాలు ఉన్నా.. భారతీయ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని సూలే చెప్పారు.
“విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)తో సంబంధాలు చాలా బాగున్నాయి. వారు ఎప్పుడూ సహాయం చేయడానికి ముందుంటారు” అని సులే అన్నారు. ముంబైలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించానని అన్నారు.
ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో.. తానాజీ షిండే వీసా గురించి సహాయం కోరుతూ జైశంకర్‌ను ట్యాగ్ చేశారు.
షిండే కుటుంబం చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో నీలం షిండే చేతులు, కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తలపై కూడా గాయాలయ్యాయి.
షిండే నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నారు. ఆమె అక్కడ చివరి సంవత్సరం చదువుతున్నారు.