ఆట, పాట, సరదా, చదువు.. అన్ని సమపాళ్లలో ఉంటేనే పిల్లలు మానసిక వికాసంతో విరాజిల్లుతారు. పాఠశాల్లో పాఠాలు అయ్యాక స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఫేర్ వెల్ పార్టీకి వెళ్లడం మహా నేరమా..? ఇది నేరం, ఘోరం ఏమిటి..? చక్కగా చదువుకునే కుర్రాడు ఫేర్ వెల్ పార్టీలకు వెళ్లాలి, సరదాగా, ఆనందంగాను గడపాలి అని ఎవ్వరైనా అంటారు. అయితే, ఆ కుర్రాడు తండ్రికి మాత్రం ఇది మహా నేరం, ఘోర తప్పిదం అని తేల్చేశాడు. అందుకు తీవ్ర దండన విధించేశాడు. పిల్లాడి ప్రాణాలు తీసేశాడు. యాదాద్రి చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో…అరె..ఇంత దారుణం జరిగిపోయిందేమిటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ గ్రామంలో సైదులు అనే వ్యక్తి ఫూటుగా తాగేసి ఇంటికొచ్చాడు. అనంతరం ఫేర్ వెల్ పార్టీకి వెళ్లిన కుమారుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చాడని తెగ కోపం తెచ్చేసుకున్నాడు.
ఏం జరిగింది, బిడ్డ ఎక్కడికి వెళ్లాడు, ఎందుకు వెళ్లాడు.. ఇవేమీ విచారించకుండా.. ముక్కుపచ్చలారని తొమ్మిదో తరగతి విద్యార్థి భాను పై సైదులు విరుచుకుపడ్డాడు. గొడ్డును బాదినట్టు బాదేయడంతో.. ఆ పిల్లాడు అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. కొన ఊపిరితో ఉన్నాడని భావించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆ కుర్రాడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. బాలుడి మృతదేహాన్నిఖననం చేసేందుకు మృతుడి బంధువులు ప్రయత్నించగా, పోలీసులు దాన్ని నిలువరించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేసిన పాడు పనికి చెంపలేసుకున్న, తల నేలకుకొట్టుకున్నా తిరిగి రాని లోకాలకు కుమారుడు వెళ్లిపోయాడు. ఈ ఘోరానికి పాల్పడ్డ నిందితుడు సైదులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.