ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కలిసివచ్చిన అంశాలేంటి.? రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారం కోసం వేచి చూస్తున్న బీజేపీకి.. ఈ ఎన్నికలు ఎలా ప్లస్ అయ్యాయి.? ఢిల్లీలో విజయం కోసం బీజేపీ అనుసరించిన వ్యూహాలేంటి….?
దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. దేశ రాజధానిలో గెలుపు కోసం వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేసింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కీలక నేతలు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూనే.. ఏఏ సెగ్మెంట్లలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమగ్రంగా చర్చించిన తర్వాత తమ ప్లాన్ ను అమలు చేశారు. గత ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే పరిమితమైన బీజేపీ… తాజా ఎన్నికల్లో అసాధారణ గెలుపును సొంతం చేసుకోవడం వెనక డబుల్ ఇంజెన్ అభివృద్ధి మంత్రం పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు హామీలను పేద, మధ్యతరగతి ప్రజలకు మరింతగా విస్తృతం చేస్తామన్న హామీలు బీజేపీకి కలిసివచ్చింది. పార్టీ కీలక నేతలనై పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, రమేష్ బిధూరి, బన్సూరి స్వరాజ్, స్మృతి ఇరానీ, దుష్యంత్ గౌతమ్ మొదలైన నాయకులంతా పార్టీని ఏకతాటిపైకి తేవడంతో పాటు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలలో అర్థమయ్యేలా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు నమో యాప్ ద్వారా వర్కర్లతో వర్చువల్ గా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం ఎన్నికల్లో కలిసి వచ్చింది. బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టోలోనూ స్థానికంగా ప్రజలను ఆకట్టుకునే విధంగా పలు అంశాలను ప్రస్తావించడం గెలుపులో కీలకమయ్యింది. ముఖ్యంగా యమునా నది శుద్ధీకరణ, రోడ్డు రవాణా సౌకర్యాల కల్పన, 10 లక్షల ఆరోగ్య బీమా, 5 లక్షల ప్రమాద బీమా, గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని 17 వందల అనధికార కాలనీలలో నివసించే ప్రజలకు యాజమాన్య హక్కుల కల్పన వంటి హామీలు బీజేపీకి కలిసివచ్చింది.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావడానికి ఇటీవల కేంద్ర బడ్జెట్ కూడా ఓ కారణమని పలువురు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి బడ్జెట్ లో ఇన్ కమ్ టాక్స్ భారీగా తగ్గించడం వంటివి మధ్యతరగతి వర్గాల్లో సానుకూలత కలిగేలా చేసిందన్న ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ పై ప్రభుత్వ , ఐటీ ఉద్యోగుల నుంచి సానుకూల స్పందన రావడంతో ఎన్నికల్లో ఆ వర్గం ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని పలువురు విశ్లేషిస్తున్నారు. స్విగ్గీ, జెమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ వర్కర్ల గురించి బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారిందని సమాచారం.. గిగ్ వర్కర్లకు పింఛన్ ఇచ్చే ఆలోచన ఆయా కుటుంబాలు బీజేపీకి దగ్గరైనట్లు తెలుస్తోంది.
ఇక 1993లో ఒక్కసారి మాత్రమే బీజేపీ ఢిల్లీలో విజయం సాధించింది. అప్పట్లో బీజేపీ ఏకంగా 49 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 14 సీట్లకు పరిమితమైంది. 1998 తరువాత అధికారం కోసం బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరకు నిరాశ ఎదురైంది..1998 నాటి ఎన్నికల్లో బీజేపీ 15 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ మాత్రం 52 స్థానాలను గెలుచుకుంది. ఇక 2003 ఎన్నికల్లో బీజేపీ కొద్దిగా పుంజుకుని 20 సీట్లు దక్కించుకుంది. ఆ తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య 23కు చేరింది. 2013 నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం చేయడంతో ఢిల్లీలో సీన్ మొత్తం మారిపోయింది. ఆప్ బలపడటంతో బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారింది. 2013 ఎన్నికల్లో బీజేపీ 31 సీట్లు ఆప్ 28 సీట్లు గెలిచుకోగా… కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, ఈ పొత్తు రెండేళ్లకు మించి కొనసాగలేదు. 2015 ఆప్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి ఒంటరిగా ఎన్నికల్లో దిగి సొంతంగా మెజారిటీ సాధించింది. ఇక నాటి ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది. 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 62 సీట్లు గెలుచుకుని అజేయంగా నిలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.