నిధుల వేటలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కసరత్తు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 10న రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో టిడ్కో గృహాలు, డ్వాక్రా లోన్లు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి లాంటి కేంద్ర పథకాలపై సమీక్షించనున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పింఛన్లు, ఉచిత సిలెండర్ల పథకం మినహా మరేవీ అమలు కావడం లేదని ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నట్టు తెలుస్తోంది. కూటమి నేతలు సైతం ఇదే విషయాన్ని ఆఫ్ ద రికార్డ్‌గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిధులు సేకరణకు కృషి చేయాలని ఏపీ సర్కారు నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రుణాలు అందించి వారి అభివృద్ధికి తోడ్పడాలనే సదుద్దేశంతో నిధుల సమీకరణపై సీఎం చంద్రబాబు దృష్టి సారించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇందులో భాగంగానే ఈనెల 10న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. 229, 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకే సారి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 17న స్టేట్ లెవల్ బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఇప్పుడు మరోసారి జరగబోతుండడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అన్నది ఆసక్తి రేపుతోంది.
ఈనెల 10న జరగనున్న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, పీ4 విధానం అమలు అంశాలపై ప్రధానంగా ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. అలాగే.. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష, 228వ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై చర్చిస్తారు.
ఈ సమావేశంలోనే టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి పథకాల అమలుకు సంబంధించి ఏం చేయాలి.. ఎంత మేరకు రుణాలు వస్తాయి.. నిధుల సమీకరణ విషయంలో ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై బ్యాంకర్లతో సమావేశంలో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్‌వర్క్ డిజిటల్ జిల్లాల అంశంపైనే ఎస్‌ఎల్‌బీసీ చర్చించనుంది.
నిధుల వేటలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మీటింగ్‌ను అత్యంత కీలకంగా భావిస్తోంది. ఈ భేటీకి వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర కీలక ప్రభుత్వ అధికారులు హాజరుకానున్నారు.