వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల పంచాయతీ పీక్స్‌కు చేరుతోంది. జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి, ఆమె సోదరి వైఎస్ షర్మిల ఓ గ్రూప్‌గా ఉండగా.. మరో వైపు జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతితో మరోవర్గంగా నిలిచారు. సరస్వతి పవర్ కంపెనీ తమదంటే తమదని ఇరు వర్గాలు కోర్టుకెక్కాయి. కంపెనీ షేర్ల విషయంలో వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ కోర్టుకు చేరింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. ఇరు వర్గాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నారు.
ఈ కేసులో అటు విజయమ్మ తరపున లాయర్లు పిటిషన్లు దాఖలు చేస్తే.. అటు జగన్ తరపున న్యాయవాదులు కౌంటర్లు దాఖలు చేస్తున్నారు. ఒకరు ఓ పిటిషన్ దాఖలు చేస్తే.. దానిపై వివరణ ఇస్తూ మరో వర్గం కౌంటర్ దాఖలు చేస్తోంది. ఇలా ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇటీవల విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ లో అసలు సరస్వతి పవర్ కంపెనీలో జగన్ కు గానీ… భారతికి గానీ చిల్లిగవ్వ కూడా వాటా లేదని ఆమె కోర్టుకు తెలిపారు. కంపెనీకి చెందిన మొత్తం 99 శాతం షేర్లు తన పేరు మీదే ఉన్నాయని కూడా విజయమ్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇక దీనిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్ లో విజయమ్మ, షర్మిలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన పేరు, తన సతీమణి భారతి పేర్లపై ఉన్న షేర్లను తమకు తెలియకుండానే విజయమ్మ, షర్మిల వారి పేర్ల మీద మార్చుకున్నారని జగన్ ఆరోపించారు. కనీసం తన సంతకాన్ని కూడా తీసుకోకుండానే షేర్లను వారి పేర్లపైకి బదలాయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ షేర్ల బదలాయింపును నిలుపుదల చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు విజయమ్మ, షర్మిలతో పాడు సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లను ఆయన ప్రతివాదులుగా చేర్చారు. ఇక జగన్ వాదనపై కౌంటర్లు దాఖలు చేసేందుకు విజయమ్మ తరఫు న్యాయవాదులు సమయం కోరారు. కోర్టు కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.