మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కిరాకముందే.. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో కొత్త కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కేసుపై కడప ఎస్పీ అశోక్‌కుమార్ అధికారికంగా కూడా ప్రకటన చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు చూస్తే ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో సాక్షులంతా చనిపోతుంటే ఈ కేసు ముందుకెలా సాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న రంగన్న రెండు వారాల కిందట కిందపడ్డాడు. అప్పుడు కాలికి గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని ఇంటి వద్దే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని తెలపడంతో కుటుంబ సభ్యులు, ఆయనకు రక్షణగా ఉన్న కానిస్టేబుల్ రంగన్నను కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
వివేకా హత్య కేసులో రంగన్న కీలక సాక్షి. వివేకా హత్య జరిగినప్పుడు ఇంటి మెయిన్ గేటు వద్దే ఆయన నిద్రపోతున్నాడు. వివేకా ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్న నేపథ్యంలో వివేకా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి రంగన్నే. వివేకా హత్య అనంతరం పోలీసులు, సీబీఐ అధికారులు రంగన్న వాంగ్మూలాన్ని తీసుకున్నారు. రంగన్న స్టేట్‌మెంట్ ఈ కేసులో చాలా కీలకంగా మారింది. గత టీడీపీ హయాంలో 2019 ఎన్నికలకు ముందు మార్చి 15న వివేకా నంద హత్యకు గురయ్యరు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ విపక్ష నేతగా ఉన్న జగన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేసు సీబీఐ చేతికి వెళ్లింది కానీ.. వేగంగా దర్యాప్తు సాగలేదు. హత్య జరిగిన నెలల వ్యవధిలోనే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అయినా బాబాయ్ హత్యకు సంబంధించి దర్యాప్తులో పురోగతి వస్తుందనుకున్నా.. అలాంటిదేమీ జరగలేదు. ఇక వివేకా కుమార్తె సునీత్ ఈ కేసును త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు కూడా ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయాలంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఆశించిన మేర ఫలితం రాలేదు.
ఇలాంటి నేపథ్యంలో ఈ కేసులో రంగన్నతో కలిసి నలుగురు సాక్షులు మృతి చెందడం కూడా కేసు దర్యాప్తుపై మరింతగా ప్రభావం చూపనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. . వైఎస్సార్ జిల్లా కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019లో చనిపోగా, కీలక వాంగ్మూలం ఇచ్చిన కల్లూరి గంగాధరరెడ్డి 2022లో చనిపోయాడు. ఆ తర్వాత డ్రైవర్ నారాయణ అనే సాక్షి కూడా చనిపోయాడు. గతేడాది సెప్టెంబర్‌లో జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారు. ఈయన కూడా వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నారు. ఇక తాజాగా ప్రధాన సాక్షి అయిన వాచ్ మెన్ రంగయ్య మృతి చెందడంతో ఇప్పటివరకు ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఐదుగురు మరణించినట్టైంది. అందరూ అనారోగ్య కారణాలతోనే చనిపోయారు.
వాచ్ మెన్ రంగన్న మృతిపై కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక, ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయని చెప్పారు. వివేకా కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందారని.. సాక్షులంతా వరుసగా మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని వెల్లడించారు. వాచ్ మెన్ రంగన్న మృతిపై సమగ్ర విచారణ, కేసును దర్యాప్తు చేయడానికి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం) ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అత్యంత అనుమానాస్పద మృతిగా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కేసును సైంటిఫిక్ యాంగిల్ లో కూడా దర్యాప్తు చేస్తామన్నారు. వివేకా హత్య కేసులో ఉన్న ముద్దాయిల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతామని కడప ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.


