సింగర్ కల్పన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె.. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారం జరగుతోందని అన్నారామె. ఈ ఘటనను ఇంతటితో ముగించాలని.. తన కుటుంబంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారామె. రెండు రోజుల కిందట నిజాంపేటలోని తన విల్లాలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను కేపీహెచ్‌పీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు పోలీసులు. చెన్నై నుంచి తన భర్త ప్రసాద్, కేరళ నుంచి కూతురు దయా ఆస్పత్రికి వచ్చారు.
స్టమక్ వాష్ చేసి అనంతరం వెంటిలేటర్‌పై కల్పనను ఉంచామని వైద్యులు తెలిపారు. కల్పన కోలుకోవడంతో వెంటిలేటర్ కూడా తీసేశామని చెప్పారు. స్పృహలోకి వచ్చిన కల్పన స్టేట్‌మెంట్ రికార్డు చేశారు పోలీసులు. తన కూతురిని హైదరాబాద్‌కు వచ్చి చదువుకోమని చెప్పడంతో ఆమె నిరాకరించిందని.. కూతురు తన మాట వినకపోవడంతో మనస్తాపంతో నిద్రమాత్రలు వేసుకున్నానని కల్పన చెప్పినట్టు తొలుత ప్రచారం జరిగింది. అయితే గాయని కూతురు దయ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. తన తల్లికి, తండ్రికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. స్ట్రెస్‌కు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతుందని.. ఆ మాత్రలు ఓవర్ డోస్ కావడంతోనే అపస్మారక స్థితిలోకి తన తల్లి వెళ్లిందని తెలిపారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కల్పన కూడా సెల్ఫీ వీడియోలో కూడా ఇలాంటి స్టేట్‌మెంటే ఇచ్చారు. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్లు చెప్పారు.
తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారామె. దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. తాను, తన భర్త, కుమార్తె సంతోషంగా జీవిస్తున్నామని… 45 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నట్లు తెలిపారు. తన భర్త సహకారం వల్లే ఇవ్వన్నీ చేయగలుగుతున్నట్లు చెప్పారు. భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవని… కుటుంబం చాలా అన్యోన్యంగా ఉందన్నారు. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదన్నారు. దానికోసం చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ లో టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నట్లు చెప్పారు. తన భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీవాసుల, పోలీసుల సహాయం వల్ల ఇప్పుడు అందరి ముందు ఉన్నానన్నారు. త్వరలోనే మళ్లీ పాటలతో అలరిస్తానని చెప్పారు.