స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమలలో(Thirumala) విషాద ఘటన చోటుచేసుకుంది. అలిపిరి(Alipiri) కాలినడక మార్గంలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్షిత కుటుంబ సభ్యులు అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు వారు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు కాస్త ముందు నడుస్తున్న బాలికపై అకస్మాత్తుగా చిరుత(Cheetah) దాడి చేసింది. కుటుంబసభ్యులు భయంతో పెద్దగా కేకలు వేయడంతో బాలికను అడవిలోకి ఈడ్చుకెళ్లింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేసేందుకు వీలుపడలేకవడంతో… శనివారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని చిరుత సగం తినేసినట్లు తెలుస్తోంది. బాధితులది నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం అని తెలుస్తోంది. చిరుత దాడిలో మృతి చెందిన బాలిక మృతదేహాన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిన్నారి లక్షిత తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.