స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 17ని తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ విలీన దినోత్సవంగా జరుపుతోంది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటూ… తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని పట్టుబడుతుండటంతో.. ఈసారి పేరు మార్చిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతోంది. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ తరపున కాకుండా… ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం .. పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగరేస్తారు. ఇదే విధంగా బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న MIM పార్టీ కూడా జాతీయ జెండాను ఎగరేస్తోంది. ఇలా ఈ రెండు పార్టీలూ… ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ… వాటిపై తమ మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్నాయి.
హైదరాబాద్‌తో పాటూ… జిల్లా కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవాల్ని జరపబోతోంది. అక్కడ కూడా అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ జెండాలు ఎగరేస్తారు. చరిత్రలో జరిగింది ఒకటైతే.. ఆ చరిత్రను బీఆర్ఎస్ వక్రీకరిస్తోందని లాంటి పార్టీలు మండిపడుతున్నాయి. దమ్ముంటే విమోచన దినోత్సవం జరపాలని సవాల్ విసురుతున్నాయి. విమోచన దినోత్సవం జరిపితే, ప్రత్యేక ఓటు బ్యాంక్ దూరమవుతుందనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ చరిత్రను తప్పుదారి పట్టిస్తోందని అంటున్నాయి.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, తెలంగాణ మాత్రం నిజాం పాలకుల కంట్రోల్ లోనే ఉంది. దాదాపు రెండున్నరేళ్లపాటూ.. తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. నిజాం పాలకులు వారిని రకరకాలుగా వేధించారు. ఆ తర్వాత సైనిక చర్యతో కేంద్ర ప్రభుత్వం.. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలకుల నుంచి స్వాధీనం చేసుకుంది. అందువల్లే.. నిజాం పాలకుల నుంచి తెలంగాణకు విమోచనం లభించింది అనేది బీజేపీ వాదన. అందుకే దీన్ని అధికారికంగా జరపాలని బీజేపీ పట్టుపడుతోంది. ఇలా ఈ అంశానికి పార్టీలు దేనికదే తమదైన వెర్షన్ ఇచ్చుకుంటున్నాయి.