టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో జీతం ఈ ఆర్థిక సంవత్సరంలో 18 శాతం పెరుగుతున్నట్టు వెల్లడైంది. బ్లూమ్ బర్గ్ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వార్షిక వేతనం 18 శాతం పెరగడంతో టిమ్ కుక్ ఇప్పుడు ప్రతి ఏటా 74.6 మిలియన్ డాలర్లు పొందనున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఆయన పొందే వార్షిక వేతనం అక్షరాలా 643 కోట్ల రూపాయలు. బేసిక్ పే మూడు మిలియన్ డాలర్లు, స్టాక్ అవార్డులు 58.1 మిలియన్ డాలర్లు, సుమారు 13.5 మిలియన్ డాలర్లు అదనపు పరిహారాలు సైతం ఉన్నాయి.
వచ్చే ఫిబ్రవరి 25 వ తేదీన కంపెనీ వార్షిక సమావేం జరగనుంది. ఈ సమావేశానికి ముందే పెద్ద మొత్తంలో టిమ్ కుక్ జీతం పెంచినట్టు యాపిల్ సంస్థ వెల్లడించింది. త్వరలో జరిగే కంపెనీ మీట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టిమ్ కుక్ వేతనం 2023 సంవత్సరంలో కంటే ఇప్పుడు బాగా ఎక్కువే. అయితే, కుక్ 2022లో అందుకున్న వేతనంతో పోలిస్తే ఇది చాలా తక్కువని తెలుస్తోంది. ఎందుకంటే, ఆయన 2022 లో వంద మిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకున్నట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన యాపిల్ ను సీఈవో టిమ్ కుక్ విశిష్ట రీతిలో తీర్చిదిద్దినట్టు ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ తీరు తెన్నులు మార్చే ఉత్పత్తుల రూపకల్పనలో, ప్రతిభావంతులైన వ్యక్తుల సేవలతో ఆపిల్ అగ్రభాగాన నిలిచేలా చేయడంలో టిమ్ కుక్ నాయకత్వం ఎంతో ప్రయోజనకరంగా మారిందని ఆ వర్గాలు తెలియజేస్తున్నాయి.