భారత సంతతికి చెందిన కాశ్ పటేల్‌ను అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా నియామకాన్ని సెనెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో కాశ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. FBIని “పారదర్శకంగా, జవాబుదారీగా , న్యాయానికి కట్టుబడి” ఉండేలా పునర్నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , అటార్నీ జనరల్ పామ్ బోండి ఇచ్చిన మద్దతుకు పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. ఎఫ్‌బీఐపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి తన నిబద్ధతను నొక్కి చెప్పారు.
“ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 9వ డైరెక్టర్‌గా నియమించబడడం నాకు గౌరవంగా ఉంది. మీ అచంచల విశ్వాసం , మద్దతుకు అధ్యక్షుడు ట్రంప్ , అటార్నీ జనరల్ బోండికి ధన్యవాదాలు” అని పటేల్ ఎక్స్ వేదికగా తెలిపారు.
“9/11 దాడుల తర్వాత మన దేశాన్ని రక్షించడం వరకు ఎఫ్‌బీఐకి ఒక చారిత్రాత్మక వారసత్వం ఉంది. అమెరికన్ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉంది.. దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్‌నిర్మిస్తాం. అమెరికన్లకు ఎవరైనా హాని చేయాలని చూస్తే.. వారి అంతు చూస్తాం” అని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్ పేరును అలస్కాకు చెందిన రిపబ్లికన్‌తో పాటు పలువురు డెమోక్రట్లు వ్యతిరేకించారు. అయితే 51-49 ఓట్ల తేడాదో కాశ్ నియామకం జరిగింది. దీంతో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా పదవిని చేపట్టిన తొలి హిందూ, భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు.


