కొన్నేళ్లుగా ఎవరికీ దొర్కక్కుండా దాక్కుంది. అసలు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఆమే ఢిల్లీ లేడీ డాన్ జోయా ఖాన్. 270 గ్రాముల హెరాయిన్‌తో గ్యాంగ్‌స్టర్ హశీం బాబా భార్య జోయాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ విలువ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో దాదాపు రూ. కోటి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
33 ఏళ్ల జోయాఖాన్.. ఇన్నాళ్ళు చట్టానికి, పోలీసుల కళ్లుగప్పి తన దందా కొనసాగించింది. కనీసం ఆమె మీద అనుమానం కూడా రాకుండా జాగ్రత్తపడింది. తన భర్త జైలుకు వెళ్లాక ఆయన నేర సామ్రాజ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడుపుతుంది. అసలు ఆమెకు ఈ అక్రమ దందాలతో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడింది. ఆమె పాత్రపై అనుమానాలు ఉన్నప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు ఆమెపై కేసు నమోదు చేయలేకపోయారు.
హశీం బాబాపై హత్య, దోపిడీ నుండి ఆయుధాల అక్రమ రవాణా వరకు డజన్ల కొద్దీ కేసులు ఉన్నాయి. జోయా ఖాన్ అతని మూడవ భార్య. 2017లో హశీం బాబాను వివాహం చేసుకునే ముందు, జోయాకు అంతకుముందే వేరొకరితో పెళ్లైంది. విడాకుల తర్వాత, ఆమెకు బాబాతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఈశాన్య ఢిల్లీలో పక్కపక్కనే ఉండేవారు. అక్కడ వారు ప్రేమలో పడ్డారు.
బాబా జైలు పాలైన తర్వాత, జోయా ఆ ముఠా కార్యకలాపాలను చేపట్టింది. తన భర్త ముఠాలో జోయా పాత్ర.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ పాత్ర అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హసీనా పార్కర్ ఒకప్పుడు దావూద్ అక్రమ వ్యాపారాలను కొనసాగించేది. దోపిడీ, మాదకద్రవ్యాల సరఫరా నిర్వహణలో జోయా పాత్ర ఉందని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వర్గాలు నిర్ధారించాయి.
సాధారణ గ్యాంగ్‌కు బాస్ లా కాకుండా, జోయా హై ప్రొఫైల్‌ను మెయింటెన్ చేసేది. ఆమె హై-ప్రొఫైల్ పార్టీలకు హాజరయ్యేది. ఖరీదైన బ్రాండ్ల దుస్తులను ధరించేది. అంతేకాదు ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్‌ని చూస్తే ఆమెకు పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది.
జోయా తీహార్ జైలులో తన భర్తను తరచుగా కలుసుకునేది. బాబా ఆమెకు కోడ్ భాషలో శిక్షణ ఇచ్చారని.. ముఠా ఆర్థిక, కార్యకలాపాలను ఎలా నిర్వహించాలో ఆమెకు చిట్కాలు, సలహాలు ఇచ్చారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా జైలు బయట ఉన్న అతని సహచరులతో పాటు ఇతర నేరస్థులతో కూడా ఆమె ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించింది.
కొన్నేళ్లుగా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ , క్రైమ్ బ్రాంచ్ ఆమెను పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాయి. అయితే ఈసారి ఆమెను పట్టుకోవడంలో స్పెషల్ సెల్ విజయం సాధించింది. నిఘా సమాచారం మేరకు.. ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో జోయాను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ నుండి తీసుకొచ్చిన హెరాయిన్ పెద్ద మొత్తంతో ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.