సంక్రాంతి సందర్బంగా పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. దాదాపు హైదరాబాద్ ఖాళీ అయింది. వీధులన్నీ బోసిపోతున్నాయి. ఎప్పుడూ ట్రాఫిక్ జామ్‌తో ఉండే రోడ్లు ఇప్పుడు ప్రశాతంగా ఉన్నాయి. పండుగ సందర్భంగా నగరవాసులు గ్రామాలకు తరలివెళ్లారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇదే అదనుగా దొంగలు ఇళ్లలోకి చొరబడి దొరికినంత దోచుకోవడం జరుగుతూ వస్తుంది. ప్రతి ఏడాది ఇలాంటి కేసులు భారీగానే నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటి యజమాని వినూత్నంగా ఆలోచించాడు. దొంగలారా .. మా ఇంటికి రాకండి అంటూ ఓ లెటర్ రాశాడు. ఆ ఇంటి యజమాని దొంగలకు లెటర్ రాసినట్టుగా ఉన్న ఈ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“మేము సంక్రాంతికి పోతున్నాం.. డబ్బు , నగలు తీసుకొని పోతున్నాము.. మా ఇంటికి రాకండి.. ఇట్లు మీ శ్రేయోభిలాషి”.. అంటూ ఓ పేపర్‌పై రాసి.. దాన్ని ఇంటి డోర్‌పై అటించి మరీ ఊరికి వెళ్లారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పండుగ వేళ ఇంటి యజమానుల ఇళ్లు గుల్ల చేసే దొంగలకు .. ఇలా ఇంటి యజమాని షాక్ ఇస్తూ సందేశం పెట్టడం అందరినీ ఆకర్షించింది. ఎప్పుడూ ఇంటి ఓనర్స్‌కు దొంగలు షాకిస్తే.. ఇప్పుడు ఇంటి యజమానే దొంగకు షాకిచ్చాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈయనెవరో దొంగలకే లెటర్ రాశారంటూ .. కామెంట్ చేస్తున్నారు.