దావోస్ పర్యటనలో ఏపీ బృందం బిజీబిజీగా గడుపుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. మూడోరోజు టెమాసెక్ హోల్డింగ్స్ భారత్ హెడ్ రవి లాంబాతో లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెమాసెక్ గ్రూప్ అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా పారిశ్రామిక పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
విశాఖ, తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్లలో REIT విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. సెంబ్ కార్ప్‌తో కలిసి రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖ, తిరుపతిలో సెమాటెక్ టెలీమీడియా ద్వారా డేటా సెంటర్లు, డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు సహకరించాలన్నారు.
పవర్ ట్రాన్స్‌మిషన్‌ను బలోపేతం చేయడం, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, బ్యాకప్ కోసం సెంబ్ కార్ప్ ఇండియా ద్వారా పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. 2028 నాటికి క్యాపిటా ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలని అనుకుంటున్నట్లు రవి లాంబా వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నవీన ఆవిష్కరణలు జరగాలని లోకేశ్ అన్నారు. దావోస్‌లో విద్యారంగ గవర్నర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ శిక్షణకు మద్దతు, శిక్షణ పొందిన వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇందుకోసం 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో 255 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పోటీతత్వాన్ని పెంచేందుకు స్టెమ్, ఏఐ విద్యపై దృష్టి సారించామని చెప్పారు.
2047 నాటికి 95 శాతం నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుందని లోకేష్ చెప్పారు. విస్తృత ఉపాధి కల్పన, సౌకర్యవంతమైన వర్క్‌ఫోర్స్ మోడల్‌తో నిరంతర అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి..రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని మంత్రి వివరించారు.