తమిళనాడులో అన్నామలై పరిస్థితి ఏంటి?

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా వెలుగొందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై ఇప్పుడు సొంత పార్టీ అధిష్టానంపైనే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిసి తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించేందుకు ఆయన ఢిల్లీకి చేరుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఆయన రాజీనామాను ఆమోదించేందుకు ససేమిరా అంటున్న కమలనాథులు, ఆయనను బుజ్జగించే ప్రయత్నాల్లో పడ్డారు. ఇంతకీ అన్నాడీఎంకేతో పొత్తు వద్దన్న అన్నామలైని పక్కనపెట్టి బీజేపీ సాధించింది ఏమిటి? సొంత కుంపటి పెట్టాలని భావిస్తున్న అన్నామలై తాజా నిర్ణయంతో తమిళనాడు రాజకీయాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి?

తమిళనాడు బీజేపీలో తనకంటూ ఒక బలమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అన్నామలై ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపి, తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం ఇవ్వడానికే ఆయన సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్ సంతోష్‌లతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. తమిళనాడులోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించిన అన్నామలై, తాను పార్టీ నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారో స్పష్టంగా అధిష్టానానికి తెలియజేశారు. అయితే ఆయన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, తొందరపడవద్దని బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు సూచించింది. ఈ విషయంపై అంతర్గతంగా మరింత చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు వేచి చూడాలని పార్టీ పెద్దలు కోరడంతో బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే బస చేయనున్నారు.

అన్నామలై రాజకీయ ప్రస్థానం చాలా భిన్నంగా మొదలైంది. 2011 బ్యాచ్ కు చెందిన ఆయన కర్ణాటక పోలీస్ విభాగంలో సింగంగా పేరు తెచ్చుకున్నారు. ఉడిపి ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన బదిలీని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనలు చేశారంటే ఆయన పనితీరు అర్థం చేసుకోవచ్చు. కైలాస మానస సరోవర్ యాత్ర, అలాగే అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న తన సీనియర్ అధికారి మధుకర్ శెట్టి మరణం ఆయన జీవితంలో కీలక మార్పులకు కారణమయ్యాయి. ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో రెండు వేల పంతొమ్మిది మే నెలలో ఆయన తన బెంగళూరు సౌత్ డీసీపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొంతకాలం తన ఎన్జీవో ద్వారా సామాజిక సేవ చేస్తూ వ్యవసాయం చేసుకున్నారు. 2020లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఆయన, కుటుంబ పాలనతో నడిచే ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశభక్తి, సిద్ధాంతాలు ఉన్న బీజేపీని ఎంచుకున్నారు.

బీజేపీలో చేరిన అనతికాలంలోనే ఆయన తన సత్తా చాటారు. 2021 ఎన్నికల తర్వాత ఎల్. మురుగన్ కేంద్ర మంత్రిగా వెళ్లడంతో తమిళనాడు రాష్ట్ర బీజేపీ పగ్గాలను అన్నామలై చేపట్టారు. పశ్చిమ తమిళనాడులో పవర్ ఫుల్ గౌండర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన ద్రావిడ పార్టీల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టేలా వ్యూహాలు రచించారు. అవినీతి వ్యతిరేక పోరాటాలు, అగ్రెసివ్ ప్రసంగాలతో యువతను విపరీతంగా ఆకర్షించారు. అన్నాడీఎంకే పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామితో ఆయన వ్యక్తిగత వైరం పెంచుకున్నారు. దీని ఫలితంగా 2023 సెప్టెంబర్ లో రెండు పార్టీల మధ్య పొత్తు ముగిసింది. పొత్తులు లేకుండా ఒంటరి పోరు చేసిన బీజేపీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో పదకొండు పాయింట్ రెండు శాతం ఓట్ షేర్ సాధించి తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది.

ఓట్ షేర్ పెరిగినప్పటికీ 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. స్వయంగా అన్నామలై కోయంబత్తూర్ లో ఓటమి పాలయ్యారు. దీంతో బలమైన ప్రాంతీయ మిత్రపక్షం లేకుండా తమిళనాడులో గెలవడం కష్టమని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక అంచనాకు వచ్చింది. అన్నామలై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో విరామం తీసుకుంటున్న సమయంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 2025లో అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో అన్నాడీఎంకేతో సానుకూలంగా ఉండే నైనార్ నాగేంద్రన్ ను నియమించి, అన్నాడీఎంకేతో తిరిగి పొత్తు పెట్టుకుంది. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ పార్టనర్ గా పోటీ చేసిన బీజేపీకి కేవలం మూడు శాతం కంటే తక్కువ ఓట్ షేర్ రావడం అధిష్టానాన్ని సైతం ఆలోచనలో పడేసింది.

బీజేపీ వ్యూహం బెడిసికొట్టడంతో అన్నామలై వాదనే నిజమైందని ఆయన మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు. తమిళనాడులో ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని స్వతంత్ర శక్తిగా ఎదగనివ్వకుండా, మళ్లీ పొత్తుల పేరుతో అధిష్టానం పార్టీ లక్ష్యాన్ని నీరుగార్చిందని అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే పార్టీ నాయకత్వం ఇస్తున్న ఎలాంటి ఆఫర్లను ఆయన అంగీకరించడం లేదు. ద్రావిడ రాజకీయ నమూనాను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఒక సరికొత్త జాతీయవాద రాజకీయ పార్టీని స్థాపించే దిశగా ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. అన్నామలై పార్టీని వీడితే తమిళనాడులో బీజేపీకి అది కోలుకోలేని దెబ్బ అని పార్టీ అంతర్గత వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఆయన బీజేపీలోనే ఉంటారా లేక సొంత పార్టీ పెడతారా అన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరుగుతుంతో ఒకటి రెండు రోజుల్లో తెలిసిపోనుంది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్