స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వరదలు వస్తే వరద సాయం చేయడు.. బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తడు అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ నిప్పులు చెరిగారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎస్ఆర్‌డీపీ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్టు అనేది సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మహానగరం ఒక విశ్వనగరం కావాలనే పటిష్టమైన ఆలోచనతో కేసీఆర్ ఈ ప్రోగ్రాం తీసుకున్నారు.
ఎస్ఆర్‌డీపీ మొదటి దశ కింద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ వంటి కార్యక్రమాలు 35 పూర్తి చేశాం. ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, ఉప్పల్, రాజేంద్రనగర్‌లో ఎటు వైపు వెళ్లినా ఎస్ఆర్‌డీపీ పనులు జరుగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం సమర్థతకు మేం పూర్తి చేసిన 35 ప్రాజెక్టులు నిదర్శనం. మోదీ ప్రభుత్వం అసమర్థతకు, చేతకానితనానికి నిదర్శనం ఉప్పల్, అంబర్‌పేట ఫ్లై ఓవర్లు. నేను ఉట్టిగనే అభాండాలు వేస్తలేను. ఉప్పల్ ఫ్లై ఓవర్ మేం నిర్మిస్తామని చెప్పాం. కానీ మేమే కట్టాలి.. ఇది నేషనల్ హైవే అని వాళ్లే తీసుకున్నారు. రూ. 190 కోట్ల ఖర్చుతో 253 ప్రాపర్టీలను రెండేండ్ల కింద పూర్తి చేసి వారి చేతుల్లో పెట్టాం. మంచినీళ్లు, కరెంట్ వంటి సౌకర్యాల కోసం జీహెచ్ఎంసీ 37 కోట్ల 86 లక్షల ఖర్చు పెట్టింది. కానీ ఇక్కడి నుంచి ఎంపీగా కొనసాగుతున్న వ్యక్తి మాత్రం వరదలు వస్తే వరద సాయం చేయడు.. బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తడు.
ఆయన సొంత నియోజకవర్గంలోని అంబర్‌పేట ఫ్లై ఓవర్‌ను పట్టించుకోవడం లేదు. దీని కోసం 262 ప్రాపర్టీలను 149 కోట్ల 90 లక్షల తో పూర్తి చేసి అప్పజెప్పం. కానీ అది కూడా నిర్మించే చేతకాదు. బయట డైలాగులు కొట్టడం కాదు.. ఇక్కడ ఉండి ప్రభుత్వం చెప్పే సమాధానాలు వినే ఓపిక ఉండాలి. చర్చల్లో పాల్గొనే ఓపిక ఉండాలి. మీడియా వద్ద స్టేట్‌మెంట్లు ఇచ్చుడు కాదు.. దీన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎస్ఆర్‌డీపీ రెండో దశ కూడా విజయవంతంగా పూర్తి చేస్తాం. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. కంప్లీట్ చేసేది మన ప్రభుత్వమే. ఈ విషయంలో ఎవరికి ఆందోళన అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.