ఏపీలో ఎన్నికల పర్వం పూర్తయ్యింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పాత అధికారగణం స్థానంలో కొత్త ఉన్నతాధికారుల రాక పర్వం ఆరంభమైంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జయకేతనం ఎగురవేయగా, వైసీపీ పరాజయం పాలైంది. ఓడలు, బండ్లు, బళ్లు ఓడలవ్వడం సర్వ సహజమే. 2019 ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో వైసీపీ విజయం సాధిం చింది. ఇప్పుడు ఆ ఘన విజయాన్ని టీడీపీ కూటమి దక్కించుకుంది. ఈ నెల 12 వ తేదీన ఏపీ సీఎంగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన టీంపై ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయంపై టీడీపీ అధి ష్ఠానం తీవ్ర చర్చలు సాగిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, పాత ప్రభుత్వ ఉన్నతాధికారుల స్థానాల్లోకి కొత్తవారు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన నీరభ్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నీభర్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న కె.ఎస్.జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. అయితే, కొత్త సీఎస్ నియమాకం జరిగినందున జవహర్‌రెడ్డిని బదిలీ చేశారు. జవహర్‌రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయను న్నారు. సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. రెండు రోజుల్లో మరో ఇద్దరు, ముగ్గురు అధికారుల నియామకం జరగవచ్చని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం జవహర్ రెడ్డి సైతం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన సెలవుపై వెళ్లడం, నూతన సీఎస్ నియామకంతో ఆయన పై బదిలీ వేటు పడడం వరుసగా జరిగాయి.