కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. చైనా పట్ల భారతదేశం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చైనాను శత్రువులా భారతదేశం చూడకూడదని శామ్ పిట్రోడా అన్న మాటలు కాంట్రవర్శీకి దారితీశాయి. పొరుగున ఉన్న చైనాను గౌరవించాల్సిన సమయం వచ్చిందన్నారు శామ్ పిట్రోడా. అంతేకాదు భారత్ మొదటి నుంచి చైనా పట్ల ఘర్షణాత్మక వైఖరితోనే వ్యవహిస్తోందని ఆయన ఆరోపించారు. భారత్ అనుసరిస్తున్న ఈ వైఖరే, రెండు దేశాల మధ్య లేనిపోని శత్రుత్వాన్ని పెంచుతోందన్నారు శామ్ పిట్రోడా. చైనా నుంచి భారత్ కు ఉన్న ప్రమాదమేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు ఆయన. అయితే చైనాను అమెరికా శత్రువుగా చూస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అమెరికా నుంచి భారత్ ఇదే వైఖరి నేర్చుకుందన్నారు శామ్ పిట్రోడా. అంతేకాదు అభివృద్ధి చెందుతున్న దేశాలు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ దేశాల్లో వృద్ధి రేటు కూడా మెల్లమెల్లగా నెమ్మదిస్తోందన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకదానికొకటి సాయం చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలు, ఇతర దేశాలతో కమ్యూనికేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు శామ్ పిట్రోడా.
అయితే, చైనాకు సంబంధించి శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు శామ్ పిట్రోడా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ భండారీ ఆరోపించారు.
కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో వాషింగ్టన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ – చైనా మధ్య వాస్తవాధీన రేఖ దగ్గర ఇటీవల జరుగుతున్న ఘర్షణల నివారణకు అమెరికా సాయం చేస్తుందన్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్ చేసిన ఈ ఆఫర్ ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ విశ్రి స్పందించారు. ఈ నేపథ్యంలో శామ్ పిట్రోడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , లోక్‌సభలో మాట్లాడుతూ భారత భూభాగంలో కొంతభాగం చైనా అక్రమణలో ఉందన్నారు. భారత సైన్యం ఉన్నతాధికారులు కూడా ఈ విషయం ధృవీకరించారని ఆయన వెల్లడించారు. రాహల్ చేసిన ఈ ఆరోపణలు వివాదంగా మారాయి. వివాదం సంగతి ఎలాగున్నా, ఒకవైపు భారత భూభాగాన్ని కొంతమేర చైనా ఆక్రమించుకుందని సాక్షాత్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటే, మరోవైపు చైనా నుంచి భారత్ కు ఎటువంటి ముప్పు లేదని ఆ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా శామ్ పిట్రోడా కు వివాదాలు కొత్త కాదు. దక్షిణ భారతీయులు, ఆఫ్రికన్లుగా కనిపిస్తారంటూ కిందటేడాది మేనెలలో శామ్ పిట్రోడా కామెంట్ చేశారు. అలాగే భారత్‌లోని పశ్చిమ రాష్ట్రాలవారు అరబ్బుల్లాగా, ఈశాన్య రాష్ట్రాలవారు చైనీయుల్లా కనిపిస్తారని కూడ ఆయన కామెంట్ చేసి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. భారతదేశాన్ని వైవిధ్యభరితమైన దేశంగా అభివర్ణించే క్రమంలో శామ్ పిట్రోడా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందువారసత్వ పన్ను చట్టం గురించి శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపాయి. అమెరికాలో ప్రస్తుతం వారసత్వ పన్ను అమల్లో ఉందన్నారు శామ్ పిట్రోడా. అటువంటి విధానం అటువంటి వారసత్వ పన్ను భారతదేశంలోనూ అమల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు శామ్ పిట్రోడా. ఇది కూడా కాంట్రవర్శీ అయింది.