టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు.
కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లినప్పుడు తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించింది. దీంతో ఈ కేసు తెరపైకి వచ్చింది. రాయదుర్గం పోలీసులు జీరో FIR నమోదు చేసి తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. ఆయనపై IPC సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు, స్వచ్ఛందంగా గాయపరచడం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జానీ మాస్టర్‌కు గతంలో నేర చరిత్ర ఉంది. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు 6 నెలల జైలు శిక్ష విధించింది. జానీ మాస్టర్ ఇటీవలే రాజకీయాల్లో చేరి జనసేన తరపున ప్రచారం చేస్తున్నాడు.