గణేశ్ నిమజ్జనాలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. చివరి రోజైన రేపు నిమజ్జనాల కోసం GHMC అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక అతి పెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనంలో కీలక ఘట్టం పూర్తయింది. మహాగణపతి చివరి పూజ అందుకున్నాడు. ఉత్సవ కమిటీ 70 అడుగుల విగ్రహానికి చివరి పూజ నిర్వహించింది. దీంతో భారీ గణపతి నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. మండపం నుంచి గణనాథుడిని వేరు చేసే పనులు ప్రారంభించారు.
నిన్న అర్ధరాత్రి 12 తర్వాత భక్తులకు దర్శనాలు నిలిపివేసింది ఉత్సవ కమిటీ. రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఒకరోజు ముందుగానే భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. రేపు నిమజ్జనం దృష్ట్యా వెల్డింగ్ తదితర పనులు జరుగుతాయనీ.. అందుకే భక్తుల దర్శనాలకు అనుమతి ఉండదని ఉత్సవ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. రేపు మధ్యాహ్నాని కల్లా ఖైరతాబాద్ లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. అయితే దర్శనాలు నిలిపివేసినా.. భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఇవాళ సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.