తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేసింది వాతావరణశాఖ. నేటి నుంచి 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన అధికారులు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, సంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు.
ఇక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నాయని తెలిపారు. రేపు మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి , వికారాబాద్, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అటు ఏపీలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది వాతావరణశాఖ. అల్లూరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, ఉభయ గోదావరి, కర్నూలు, విజయనగరం, బాపట్ల జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నం వరకూ తీర ప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని.. అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కృష్ణాతీరంలో నాచుగుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకూ అలలు అతివేగంగా వస్తాయని వెల్లడించారు. అలాగే నెల్లూరు తీరంలో కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకూ పశ్చిమగోదావరి తీర ప్రాంతం అంతటా అలలు అతివేగంతో వస్తాయని తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపారు అధికారులు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పలు చోట్ల పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని. అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదని సూచించారు.