స్వతంత్ర వెబ్ డెస్క్: ఖమ్మం(Khammam) మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి(Ponguleti Srinivas Reddy) పెద్ద ఝలకే తగిలింది. గత నెలలో ఢిల్లీలో కాంగ్రెస్(Congress) కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో తనతో పాటే కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు(Tellam Venkata Rao) మనసు మర్చాకున్నాడు. తిరిగి బీఆర్‌ఎస్‌లోకే(BRS) వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చకపోవడం, అదే సమయంలో తనను నమ్ముకున్న కార్యకర్తల నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేకనే తిరిగి బీఆర్‌ఎస్ వెళ్తున్నట్లు ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారాయన. భద్రాచలం అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపు(గురువారం) ఆయన తిరిగి బీఆర్‌ఎస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెల్లం వెంకటరావు మొదటి నుంచి పొంగులేటికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ వచ్చారు. 2018లో టీ(బీ)ఆర్‌ఎస్ తరపున తెల్లం పోటీ చేసి ఓడిపోయారు(32 శాతం ఓటింగ్.. దాదాపు 36వేల ఓట్లు పోలయ్యాయి). అయితే రాబోయే ఎన్నికల్లో భద్రాచలం టికెట్ ఆశించి మరీ ఆయన పొంగులేటితో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇక్కడే ఆయనకు ఆటంకాలు ఎదురయ్యాయి.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పొదెం వీరయ్యకే కేటాయించే అవకాశం ఉండడంతో.. వెంకటరావు నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో మరోపక్క నుంచి బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు వెంకటరావుతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే టికెట్ హామీ ఇస్తేనే బీఆర్‌ఎస్‌లోకి వస్తానని ఆయన కరాకండిగా చెప్పినట్లు ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. చివరకు ఏమైందో తెలియదుగానీ.. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటన చేసేశారు.