ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పట్టిన ‘ఆపరేషన్ అరణ్య’ విజయవంతం పట్ల ఆటవీశాఖ పనితీరును ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. ఎర్రచందనం ఒక అరుదైన జాతి, దాని పరిరక్షణ చాలా ముఖ్యమని తెలిపారు. ఎర్రచందనం సంరక్షణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పవన్ కల్యాణ్ శుక్రవారం ట్వీట్ చేశారు.
195 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో ఏపీ అటవీ శాఖ, రెడ్ శాండల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారని అన్నారు. అక్రమ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది నేరస్తులను పట్టుకున్న అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ ఆపరేషన్ అరణ్యతో ఎంతో విలువైన సహజ సంపదను అధికారులు రక్షించారని చెప్పారు. అధికారుల తిరుగులేని నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో అంకితభావం, వేగవంతమైన చర్యలు తీసుకున్న అధికారులను ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్యప్రాణులు, అటవీ నేరాలను అరికట్టేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు అండగా నిలుస్తోందని అన్నారు. ఈ విజయం భవిష్యత్ తరాల వారికి మన అడవులను సంరక్షించేలా చేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.