తెలంగాణ ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇవాళ సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖలను పూర్తిగా మార్చేసి సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని ఆరోపించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తల్లి విగ్రహావిష్కరణను తాము తిరస్కరిస్తున్నామని అన్నారు. కోట్లాది మందిలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.